వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీలతో సంక్షేమం పొందే కుటుంబాలు వందలలో ఉంటే ఆ నవరత్నాల అమలు కోసం జగన్ చేసిన నవ విధ్వంసాల భాదితులు వేలల్లో కాదు కాదు లక్షల్లో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాలు ఏమిటో ఆ పథకాలు అందుకుంటున్న కుటుంబాలకే తెలుసు కానీ వాటి కోసం జగన్ చేసిన నవవిధ్వంసాలు మాత్రం సంక్షేమ పథకాలు అందుకుంటున్న, అందుకోని కుటుంబాలు కూడా అనుభవిస్తున్నాయి. ఆ విధ్వంసాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
నవ విధ్వంసాలు:
- రాజధాని కూల్చివేత..,ఒక కులం పేరు చెప్పి ఒక పార్టీ మీద నిందేసి ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చారు.
- రోడ్డులు.., ముఖ్యంగా రాష్ట్రంలో కాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్లే సామాన్యుడి నుండి ఖరీదైన కార్లలో ప్రయాణించే ధనవంతుల వరకు నరకం స్పెల్లింగ్ రాపిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అందులోని నాయకులు.
- పక్క రాష్ట్రాలకు తరలిపోయిన పెట్టుబడులు , పరిశ్రమలు. తద్వారా రాష్ట్రంలో పెరిగిపోయిన నిరుద్యోగుల సంఖ్య.
- సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రంలో మద్యం అమ్మడం తప్ప మరో మార్గం లేదన్నట్లు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రసంగించారు. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని తాగకుండానే కిక్కెకించేలా మందు బాటిల్ రేట్లను ఆకాశానికి పెంచారు.
- రాష్ట్రంలో పెరిగిన అధికార పార్టీ నేతల దాడులు. మునుపెన్నడూ ఏపీలో చూడని రాజకీయ దాడులు ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
- గత ప్రభుత్వంతో పోలిస్తే సంక్షేమ పథకాలతో లబ్ది దారులకు పెరిగిన ఆర్థిక సాయం ఒకటి రెండు శతం ఉంటే..,పెరిగిన ఖర్చులు మాత్రం దాదాపుగా డబుల్ అయ్యిందనే చెప్పాలి. కరెంటు చార్జీల మోత నుంచి మొదలు పెడితే నిత్యావసరాల ధరలు, కొత్తగా పుట్టుకొచ్చిన చెత్త టాక్సులు …ఇలా సామాన్యుడు మోయలేనంత పన్నుల భారం వైసీపీ ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపింది.
- టాక్సుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సరిపోక అప్పులతో నెట్టుకొస్తున్న జగనన్న పోలవరం ప్రాజెక్టును పడకెక్కించారు . పనులు ముందుకు సాగకపోవడనికి నిధుల లేమి కారణమంటూ ప్రభుత్వ పెద్దలే సెలవిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
- బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న నిధులన్నీ సంక్షేమ పథకాలకు దారి మళ్లించి ఆయా వర్గాల ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఏమారుస్తుంది.
- వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లు కరోనా పాస్ లతో నెట్టుకెళ్లిన విద్యారంగం, తరువాత ఇంగ్లీష్ – తెలుగు అంటూ మునుపెన్నడూ లేనంతగా విద్యా ప్రమాణాల స్థాయిని పడేసారు.
ఇలా జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో నవరత్నాలు మాత్రం కొన్ని కుటుంబాలకే అందించి ఆ ప్రభుత్వ పాలనా తాలూకా నవ విధ్వంసాన్ని మాత్రం అందరు పంచుకోవాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సత్యసాయి జిల్లా కదిరి నియోగకవర్గంలోని చిన్నరామన్న గారి పల్లెవాసులు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కి తమ గ్రామంలోని రోడ్ల దుస్థితిని వివరిస్తూ ఒక వినతి పత్రం అందించారు.
తమ గ్రామానికి వెళ్లే రోడ్లు గుంతలతో అద్వానంగా మారిందని దాని వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ రోడ్ల వలన అనేక ప్రమాదాలు కూడా అక్కడ జరుగుతున్నాయని వెంటనే తమ గ్రామ సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి తమ గోడు వినిపించారు. అయితే గ్రామస్తుల రోడ్డు సమస్యకు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పరిష్కారం కూడా మీ చేతుల్లోనే ఉంది నన్నేం చేయమంటారో మీరే చెప్పండి అంటూ ఆ పరిష్కారాన్ని గ్రామస్తుల ముందుంచారు.
మీ నియోజకవర్గంలో ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ 15 కోట్ల పైమాటే. ఇప్పుడు మీరడిగిన సమస్యకు పరిష్కారం చూపి వెంటనే రోడ్లను మరమత్తులు చేయించాలంటే ఆ మొత్తం పెన్షన్ సొమ్ముని దారి మల్లించి రోడ్ల మరమ్మతులు చేయించాల్సిందే అంటూ వైసీపీ ప్రభుత్వం తాలూకా బాధ్యత రాహిత్యాన్ని బయటపెట్టారు.
ఏపీ రోడ్లమీద పక్క రాష్ట్రాల నాయకులు సెటైర్లు వేసే స్థాయికి రోడ్ల దుస్థితి వచ్చిందంటే వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతుల మీద ఏమాత్రం శ్రద్ద చూపించిందో అర్ధమవుతుంది. గుంతల మధ్య ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయలేక గడిచిన నాలుగేళ్లుగా అల్లాడుతున్న ఏపీ ప్రజలకు సంక్షేమం కావాలో…అభివృద్ధి కావాలో? తేల్చుకోమని తెగేసి చెప్పారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. ఈయన వరుస చూస్తుంటే మంత్రి ధర్మాన రూటునే ఫాల్లో అవుతున్నటున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి నాయకులు ఉంటే పక్క రాష్ట్రాల నేతలు అలానే స్పందిస్తారు మరి.






