ఏపీ రాజకీయాలలో నిశ్శబ్దాన్ని ఛేదించే రోజు ఎపుడు?

YSRCP TDP Janasena

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. సభలు, సమావేశాలు, చేరికలు, ఎత్తులు పైఎత్తులతో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్షాలు తమ గళాన్ని విప్పుతున్నాయి.ఎవరి పార్టీ నేతలు వారి అధినాయకత్వాన్ని ఎన్నికల ప్రచార బరిలో ఉంచి తమ తమ పార్టీల గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు అరెస్టుతో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిశ్శబ్దంలోకి నెట్టి
వేసిందనే చెప్పాలి. ఎన్నికలకు ఆరు నెలలముందు ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు అయిన బాబుని అరెస్ట్ చేయడం జగన్ చేసిన అతి పెద్ద సాహసమనే చెప్పాలి. ఆ సాహసంతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో దానికి సమాధానం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే చెప్పాలి.

ADVERTISEMENT

అయితే ఎన్నికల ఫలితాల మాట అటుంచితే అసలు ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి టీడీపీ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిందే అనేది కోర్టులలో బాబు కేసులు నడుస్తున్న తీరు బట్టి అంచనా వేయవచ్చు. అధినేత అరెస్టుతో టీడీపీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్ళిపోయింది. రిలే దీక్షలు,సంఘీభావ యాత్రలు,దేవాలయాల చుట్టూ ప్రదక్షణలు తప్ప గట్టిగా ప్రభుత్వాన్నికదిలించగల ఎటువంటి కార్యచరణ కూడా టీడీపీ నేతలనుండి రాకపోవడం వైసీపీ ప్రభుత్వానికి బలంగా మారింది.

టీడీపీ – జనసేన రెండు పార్టీలు రాజకీయ పొత్తు కుదుర్చుకున్నప్పటికీ బాబు కేసులనుండి ప్రభుత్వాన్ని ఒక్క అడుగు కూడా వెనుకకు వేయించలేక పోయింది అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. పొత్తులో ఎన్నికల బరిలో అడుగుపెడతాం అంటూ ఇరు పార్టీల అధినేతలు ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికి ఒక బలమైన ఉమ్మడి కార్యాచరణ రూపొందించలేక పోయారు. ప్రకటనలతో మొదలుపెట్టి కార్యాచరణలో కాలయాపన చేయడం ఇరు పార్టీల విలువైన రాజకీయ కాలం వృధా చేసినట్టే.

అధికార పక్షం తనకున్న అధికారంతో వ్యవస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను కట్టడి చేయడంలో తాత్కాలికంగా విజయం సాధించినట్టే అని చెప్పాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టంలో అటు టీడీపీ ఇటు జనసేన తన విలువైన కాలాన్ని వదులుకుంటున్నారు. అధినేత అరెస్టుతో అనుభవం అంతగా లేని లోకేష్ ఇటువంటి క్లిష్ట సమయంలో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనేది బాబు సూచనలతోనే సాధ్యమవవుతుంది.

ఇక జనసేన విషయానికి వస్తే అటు బీజేపీ తో పొత్తును ఎటు తేల్చుకోలేక, దానికి తోడు తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన పార్టీ పోటీ చేయడంలో తెలంగాణ జనసేన నేతల సూచనలతో పునరాలోచనలోకి పవన్ వెళ్లడంతో ఏపీ రాజకీయాలకు కొద్దీ సమయం విరామం ప్రకటించాల్సిందే. ఇలా ఇరు పార్టీలు తమకున్న అడ్డంకులను దాటుకుని ఏపీ ఎన్నికల బరిలోకి అడుగుపెట్టే సమయానికి అధికార వైసీపీ మీన మేషాలు లెక్కిస్తూ కూర్చోదు కదా! తన పార్టీ గెలుపుకి అవసరమైన అన్ని వ్యవస్థలను వాడుకోవడానికి వైసీపీ సిద్దమవుతుంది.

ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఒక్క డుగు ముందుకు వేస్తే జగన్ ప్రభుత్వం తన కనుసన్నలలో పనిచేసే వ్యవస్థలను అడ్డుపెట్టుకుని నాలుగు అడుగులు వెనక్కి లాగుతున్నారు. ఇక ఏపీలో ప్రతిపక్ష నేతలకు రానున్నది గడ్డు కాలమే అనేది ఇప్పటికే వైసీపీ నేతలు, మంత్రులు ఇరు పార్టీల నేతలను హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు కేసు అనే పద్మవ్యూహం లోనుంచి టీడీపీ బయటకు రాలేక, బీజేపీ అనే అనకొండను దాటి జనసేన అడుగుముందుకు వేయలేక ఇలా ఆలోచనలతో కాలయాపన ఇరుపార్టీల రాజకీయ భవిష్యత్ కి గట్టి దెబ్బగానే భావించాలి.

బీజేపీ వ్యూహాలను వైసీపీ అమలు చేస్తుందో, వైసీపీ రాజకీయ కుట్రలకు బీజేపీ మద్దతు తెలుపుతుందో, లేక ఆ రెండు పార్టీల ఉమ్మడి కార్యచరణ ఇదేనా అన్నట్లు చంద్రబాబు కేసు
విచారం సాగడం ఇలా రాష్ట్రంలో సమాధానం చిక్కని ప్రశ్నలే ఎన్నో! ఇకనైనా టీడీపీ – జనసేనలు.., వైసీపీ – బీజేపీ పార్టీల ఉమ్మడి కార్యాచరణలో బందీలుగా మిగలకుండా ఏపీలో కొనసాగుతున్న రాజకీయ నిశ్శబ్దాన్ని ఛేదించి దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టే రోజు తొందర్లోనే రావాలంటూ ఇరు పార్టీల శ్రేణులు తమ అధినేతల కోసం వేచి చూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories