ఏపీలో మరో విద్యుత్‌ బాదుడు తప్పదా?

Andhra-Pradesh-Power-Bills-Farmersఏపీలో విద్యుత్‌ సరఫరా లేకపోయిన విద్యుత్‌ బిల్లులు ముట్టుకొంటేనే షాక్ ఇస్తున్నాయి. వినియోగదారులు వాడింది కొంతయితే, దానికి రకరకాల పేర్లతో ఛార్జీలు జోడించి భారీగా బిల్లులు చేతిలో పెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు, ఇంకా విద్యుత్‌ రాయితీలు పొందుతున్న కులవృత్తులవారందరిపై మరోసారి భారీగా బిల్లులు వడ్డింపు అనివార్యంగా కనిపిస్తోంది.

ఆర్ధిక సమస్యలతో కటకటలాడుతున్న వైసీపీ ప్రభుత్వం, విద్యుత్‌ సంస్కరణలు అమలుచేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పుల కోసం ఆశపడటమే దీనికి కారణం.

ADVERTISEMENT

వైసీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు అంగీకరించి 2021-22, 2022-23లో కలిపి మొత్తం రూ.9,574 కోట్లు అప్పులు తెచ్చుకొంది. మళ్ళీ 2023-24లో మరో రూ.7,000 కోట్లు అప్పు తెచ్చుకొనేందుకు అవకాశం లభిస్తుంది.

ఈ అప్పుల భారం ఎలాగూ రాష్ట్ర ప్రజలే మోయాలి. ఇది కాక విద్యుత్ సంస్కరణల పేరుతో పెట్టబోయే స్మార్ట్ మీటర్స్ అదనపు భారంతో పాటు త్వరలో ప్రవేశపెట్టబోయే ప్రీపెయిడ్ బిల్ పేమెంట్ సిస్టమ్‌లో అవకతవకలు లేదా లోపాలకు కూడా ప్రజలే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఇంతవరకు వ్యవసాయానికి రాయితీతో విద్యుత్ సరఫరా అవుతోంది కానీ ఇకపై వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్స్ బిగిస్తే, ముందుగా రైతులే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఆ రాయితీ సొమ్మును ప్రభుత్వం వారి ఖాతాలలో జమా చేస్తుంది.

ఉద్యోగుల జీతాల చెల్లింపుకే ఇబ్బంది పడుతున్న వైసీపీ ప్రభుత్వం, రైతులు చెల్లించిన విద్యుత్ బిల్లులు వెంటవెంటనే చెల్లిస్తోందనుకోవడం అవివేకం అత్యాసే అవుతుంది కదా?

స్మార్ట్ మీటర్స్ ద్వారా విద్యుత్ వినియోగం లెక్కించి బిల్లులు చెల్లించడం ఒక్క వ్యవసాయ రంగానికే పరిమితం కాదు. విద్యుత్ రాయితీ పొందుతున్న అందరికీ వర్తిస్తుంది.

పైగా ఈ విద్యుత్ సంస్కరణల అమలును అంటే విద్యుత్ సరఫరా, వినియోగం, చెల్లింపులు, రాయితీలు అన్నిటినీ కేంద్రప్రభుత్వం పర్యవేక్షిస్తుంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వివరాలను దాచిపెట్టడానికి సాధ్యం కాదు.

వంట గ్యాస్ సబ్సీడీని ఎత్తివేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా ఇదే విధానాన్ని అమలుచేశాయి. కనుక రాబోయే రోజుల్లో ఉచిత లేదా రాయితీ విద్యుత్ పూర్తిగా ఎత్తివేయడమే కాక ఎప్పటికప్పుడు బాదుడు కూడా భరించాల్సి ఉంటుంది.

సంక్షేమ పధకాల కోసం అప్పులు… అప్పుల కోసం విద్యుత్ సంస్కరణలు, ఆ పేరుతో మళ్ళీ విద్యుత్‌ బిల్లుల బాదుడు. ఏడు చేపల కధలా ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories