విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అటు కేంద్ర ప్రభుత్వానికి నొప్పి తగలకుండా ఇటు ఏపీ ప్రజలను ఏ మారుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ కాలం గడిపేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి.
ఈ బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. బంద్ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత యథావిధిగా ఆ బస్సులు తిరుగుతాయన్నారు. ఆర్టీసీ సిబ్బంది విధిగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని సూచించారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని… ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణ విషయం పై కేంద్రం మీద ఒత్తిడి తేవడంలో ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
“ముఖ్యమంత్రి ప్రధానికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. కనీసం అసెంబ్లీని సమావేశ పరచి ప్రవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని కూడా చెయ్యలేదు. కేంద్రానికి నొప్పి తగలకుండా అదే సమయంలో ఏదో చేస్తున్నాం అని ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. చెయ్యాల్సింది చెయ్యండి ముందు జగన్ గారు,” అని వారు తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు.





