ఈ రోజు మా సాక్షి పేపర్ లో రాసారు, పెద్దలు అప్పల్రాజు గారు కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిటంటే… మా జగనన్న వచ్చిన తర్వాత 5 లీటర్లు పాలిచ్చే గేదెలు ‘జగనన్న పాల వెల్లువ’తో 9 లీటర్లు దాకా ఇస్తున్నాయని చెప్పారు. గేదెలకు ఏం చేసారో నాకైతే పెద్దగా తెలియదు గానీ, మరి నిజంగా జగనన్న పాడి అంత స్థాయిలో వృద్ధి చెందిందంటే చాలా సంతోషం.
మరి ఈ టెక్నాలజీ ఇతర రాష్ట్రాలకు కూడా చెప్తే బాగుంటుంది. సాక్షి టీవీ చూస్తే వాళ్ళ దిగుబడి పెరిగిందా? పేపర్ చదవడం నేర్పారా? స్మైల్స్ తో ఆయన ఫోటో పెడితే పాలు ఎక్కువ ఇచ్చేస్తోందా? మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికి కూడా అలా పెరిగి ఉంటే పెంచిన అప్పల్రాజు గారికి, ఆయన్ని మెచ్చుకున్న మా ప్రియమైన ముఖ్యమంత్రి గారికి, ఈ పెరిగిన జగనన్న పాడి సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు – వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.
5 లీటర్లు నుండి 9 లీటర్లు అంటే 4 లీటర్లు అదనంగా దిగుబడి పెరిగిందంటే మామూలు విషయం కాదు, ఈ 9ని వీలైతే 10 లీటర్ల వరకు పెంచాలని, అప్పుడైతే డబుల్ అయినట్లు ఉంటుందని, అప్పల్రాజు గారికైతే ‘భారతరత్న’ లాగా ‘పాడి రత్న’ ఇవ్వాలని, అంతకుమించిన అవార్డు ఏదైనా ఉంటే మా ముఖ్యమంత్రి ఇవ్వాలని, కేంద్రంలో ఆ అవార్డులు పెట్టినా, పెట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని అవార్డు పెట్టాలని కోరుకుంటున్నాను.
ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ అంతా కూడా అమూల్ డైరీ డెవలప్మెంట్ గా మారిపోయింది, మరి ఏ టెండర్ చూసి అమూల్ కు ఈ డైరీ డెవలప్మెంట్ కట్టపెట్టారో, ఇంత శ్రద్ధ అమూల్ పై ఎందుకు పెట్టారో అన్నది ఆలోచించవలసిన విషయం. అమూల్ పై చూపెట్టిన ప్రేమ రాష్ట్రంలో అందరి రైతుల మీద చూపించాలని, కేంద్ర ప్రభుత్వం ఈ పాడి పరిశ్రమకు చాలా సహాయం చేస్తోందని, వీటిని కూడా ‘జగనన్న పాల వెల్లువ’లో వేసేసాం.
ఈ అమూల్ పై తానే కోర్టులో పిల్ వేశానని, ప్రస్తుతం విచారణలో భాగంగా వాయిదాలు పడుతున్నాయి, కనీసం కోర్టులో తీర్పు వచ్చే వరకైనా అమూల్ పై చూపిస్తున్న అమూల్యమైన ప్రేమను కంట్రోల్ చేసుకోండి అంటూ ఆర్ఆర్ఆర్ విన్నవించుకున్నారు. ఆన్ లైన్ లైవ్ వేదికగా రఘురామకృష్ణంరాజు రోజూ నిర్వహించే ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా నేడు వివరించిన అమూల్యమైన అంశాలలో ఈ ‘జగనన్న పాడి’ ఒకటి!



