తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాబోతోంది. అయితే తెలంగాణ అంతటా తన ప్రభావం చూపిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పరిధిలో మాత్రం ఒక్క సీటు కూడా దక్కించుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. టిడిపి ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంది. వైఎస్ షర్మిల పార్టీ కూడా తప్పుకొని కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది.
చంద్రబాబు నాయుడు అరెస్టుని సమర్ధిస్తున్నట్లు కేసీఆర్ మౌనంగా ఉండిపోవడం, కేటీఆర్ కాస్త వంకరగా మాట్లాడారు. కనుక ఈ అన్ని కారణాల వలన హైదరాబాద్‌లో ఆంధ్రా ఓటర్లు అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసి గెలిపిస్తారనుకొంటే, బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేశారు. ఎందుకు?అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.
దీనికి కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
- హైదరాబాద్‌లో ఓటర్లు ఎప్పటిలాగే ఓట్లు వేయకపోవడం. ఆ కారణంగా ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం.
- గ్రేటర్ పరిధిలో కేటీఆర్ ప్రచారంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చక్కగా వివరిస్తూనే కాంగ్రెస్ వస్తే అభివృద్ధి నిలిచిపోతుందని గట్టిగా ప్రచారం చేయడం. హైదరాబాద్ అభివృద్ధిని కళ్ళారా చూస్తున్న నగర ప్రజలు దాంతో సంతృప్తి చెంది బిఆర్ఎస్‌కు మళ్ళీ ఓట్లు వేశారు.
- గ్రేటర్ పరిధిలో ఆంధ్రా ఓటర్లందరూ తమవైపే ఉన్నారనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉత్తర, తెలంగాణ జిల్లాలపై పట్టు సాధించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టి అక్కడే ఎక్కువ ప్రచారంలో మునిగిపోవడం.
- గ్రేటర్ పరిధిలో బిఆర్ఎస్ అభ్యర్ధులందరూ గత పదేళ్ళలో తమ తమ నియోజకవర్గాలపై పూర్తి పట్టు సాధించడం.
- వారిలో చాలా మంది నేతలు గతంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నవారే. కనుక చాలా కాలంగా వారికి నియోజకవర్గాలలో ప్రజలతో మంచి బలమైన బంధం ఉంది. ఇదీ వారికి ఎన్నికలలో కలిసి వచ్చింది.
- బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి బిఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా సాయపడటం. అందుకే కూకట్‌పల్లిలో జనసేనకు పడాల్సిన ఓట్లు బిఆర్ఎస్‌కు పడ్డాయనుకోవచ్చు.
గ్రేటర్ పరిధిలో బిఆర్ఎస్, బీజేపీ బలపడినప్పటి నుంచి కాంగ్రెస్ చాలా కాలంగా వెనకబడిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు పదవుల కోసం కీచులాడుకొంటూనే గడిపేశారు తప్ప పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నించకపోవడం.




