నెల్లూరు అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు సొంత పార్టీలోను, బయట కూడా శత్రువులు పెరిగిపోతుండటంతో ఆ అసహనం మీడియా సమావేశాలలో ప్రదర్శిస్తున్నారు. ఒక్కోసారి ఒక్కొక్కరిపై విరుచుకు పడుతున్నారు. మొన్న నెల్లూరు నగర మేయర్, తన సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్‌పై విరుచుకుపడగా, నిన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
ఆనం రామనారాయణ రెడ్డికి దమ్ముంటే ఈసారి నెల్లూరు పట్టణం నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు. ఒకవేళ ఎన్నికలలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొంటానని అన్నారు. ఆనంకు వయసు అయిపోయింది కనుక ఆయన ఓడిపోయినా పెద్ద తేడా ఉండదు కనుకనే రాజీనామాలు చేద్దామని సవాళ్ళు విసురుతున్నారని, కానీ మరో 9 నెలల్లో ఎన్నికలు వస్తుంటే ఇప్పుడు రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటని అనిల్ ప్రశ్నించారు.
నెల్లూరులోనే తన రాజకీయ జీవితం సమాప్తం అవ్వాలన్న ఆనం రామనారాయణ రెడ్డి కోరికను తప్పకుండా తీరుస్తానని అనిల్ అన్నారు. నారా లోకేష్ చేస్తున్నది పాదయాత్ర కాదు విహారయాత్ర అని ఎద్దేవా చేశారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని నారా లోకేష్ ఒక్కసారి కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. జిల్లా అభివృద్ధిపై చర్చకు తాను సిద్దమని నారా లోకేష్‌కు సవాల్ విసిరారు,
అయితే అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదగడానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ ఇద్దరూ ఎంతగానో కృషి చేశారని నెల్లూరులో అందరికీ తెలుసు. ఇంకా జిల్లాలో సీనియర్ నేతలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటివారి అండదండలు, ఆశీర్వాదం లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కనీసం ఎమ్మెల్యే కాలేకపోయేవారని జిల్లా వైసీపీ నేతలందరికీ తెలుసు.
కానీ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ తన స్వయంశక్తితో ఈ స్థాయికి ఎదిగానన్నట్లు మాట్లాడుతూ, తన ఎదుగుదలకు తోడ్పడినవారిపైనే కత్తులు దూస్తున్నారిప్పుడు. జిల్లాలో, పార్టీలో మారిన రాజకీయ పరిస్థితులు చూసి బహుశః తీవ్ర అభద్రతాభావంవంతో అనిల్ కుమార్ యాదవ్ ఈవిదంగా మాట్లాడున్నారేమో?



