అన్నామలై రాజీనామా ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం కళ్ళు తెరిపిస్తుందా.? రాష్ట్ర నాయకత్వం క్షేత్ర స్థాయిలో ఎంత బలంగా పనిచేసినా అందుకు అధిష్టానం సహకారం లేకపోతే ఫలితాలు ఎలా ఉంటాయి అనేదానికి అన్నా మలై ఉదాంతం చక్కటి నిదర్శనంగా నిలిచింది.
మొన్న తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలో ఒక స్థాయికి వచ్చిన టి.బీజేపీ రాజకీయం అధిష్టాన నిర్ణయాలతో తిరిగి యధాస్థానానికి చేరింది. ఇక ఇప్పుడు అన్నామలై కష్టంతో తమిళనాడులో బీజేపీ ఓటు బ్యాంకు గతంతో పోలిస్తే కాస్త మెరుగుపడిన మాట వాస్తవం.
కానీ ఇప్పుడు అన్నా రాజీనామాతో బీజేపీ తమిళనాడులో తిరిగి పుంజుకోగలదా.? ఇప్పటికే తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే వంటి బలమైన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఇక విజయ్ టీవీకే తొలి ప్రయత్నంలోనే లక్ష్యాన్ని అందుకుని బీజేపీ కి మరో పెద్ద రాజకీయ అడ్డంకిగా మారింది.
ఇలాంటి సమయంలో కేంద్ర బీజేపీ పార్టీ కోసం బలంగా పనిచేసే నాయకత్వాన్ని తన నిర్లక్ష్యంతోనే, తన నిరంకుశత్వంతోనో అణిచివేస్తే భవిష్యత్ లో దక్షణాదినా బీజేపీ రాజకీయంగా ఎదుగుతుందా.? బీజేపీ ఎదుగుదల కోసం రాష్ట్ర నాయకులు ముందుకొస్తారా.?
రాష్ట్ర రాజకీయాలకు తగ్గట్టుగా కేంద్ర బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సకల అధికారులు ఇవ్వగలగాలి, అలాగే వారి ఆలోచనలకు తగ్గట్టుగా రాష్ట్ర రాజకీయాలను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీలో పూర్తి స్వేచ్ఛ ను కల్పించాలి. పార్టీలోని నాయకులందరినీ ఏకతాటి మీదకు తెగలగాలి.
ఏపీలో బీజేపీ కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో బీజేపీ క్షేత్ర స్థాయి బలమేమిటో కేంద్ర బీజేపీ కూడా తెలిసిన విషయమే. ఏపీ బీజేపీ లో కొందరు వైసీపీ జపం చేస్తుంటారు, మరికొందరు అసలు ఏపీలో ఉంటూ ఏపీ రాజకీయాలకు సంబధం లేదు అన్నటుగా ప్రవర్తిస్తుంటారు.
ఇక తెలంగాణలో టి. బీజేపీ మనిషికో మాట, వర్గానికో నినాదం అన్నట్టుగా అంతర్గత రాజకీయ కుమ్ములాటలతో అల్లాడుతోంది. ఇలా కేంద్ర బీజేపీ రాష్ట్ర నాయకత్వాల మీద సరైన ద్రుష్టి కేంద్రీకరించకపోతే మొన్న తెలంగాణలో మాదిరి నిన్న తమిళనాడు తరహాలో నేడు మరో రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా భారీ మూల్యం చెలించక తప్పదు..!




