
సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ కు 2015వ సంవత్సరం ఎంత మధురమైన అనుభూతులను పంచిందో, అదే సంవత్సరం వ్యక్తిగతంగా అంతటి విషాదాన్ని కూడా మిగిల్చింది. 2015 సంక్రాంతికి విడుదలైన వెంకటేష్, పవన్ ల మల్టీస్టారర్ “గోపాల గోపాల”తో మొదలైన హవా ‘టెంపర్’తో పతాక స్థాయికి చేరుకుంది. పవన్ సినిమాకు పని చేయడం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన సంఘటనగా అనూప్ అభివర్ణించిన విషయం తెలిసిందే. తెలుగులో ఇద్దరు టాప్ హీరోలకు ఒకే ఏడాదిలో సంగీతం అందించిన అనూప్, ప్రతిష్టాత్మకమైన అక్కినేని వారసుడు “అఖిల్” తెరంగ్రేటంలోనూ భాగస్వామి అయ్యాడు. అలా ఇప్పుడిప్పుడే టాప్ సంగీత దర్శకుడి జాబితాలోకి వెళ్తున్న అనూప్ కు డిసెంబర్ 18వ తేదీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
బాత్‌రూంలో జారిపడి చిన్న చిన్న దెబ్బలకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అనూప్ రూబెన్స్ తల్లి మనోహరం గుండెపోటుతో ‘కాలం’ చేసారు. 65 సంవత్సరాల వయసు గల తల్లి కొడుకు ఎదుగుతున్న సమయంలో స్వర్గాస్తురాలవ్వడం కుటుంబ సభ్యులను కలచి వేస్తోంది. ఇటీవలే మరో సంగీత తరంగం దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తిని కోల్పోయిన తరుణంలో… అనూప్ తల్లికి దూరం కావడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర ద్రిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా అనూప్ రూబెన్స్ తల్లి మనోహరం ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం…





