ముళ్ళ కిరీటం ధరించి యుద్ధ రంగంలోకి పురందేశ్వరి

AP-BJP-Daggubati-Purandeswari-JP-Naddaదగ్గుబాటి పురందేశ్వరి అమర్నాధ్ యాత్ర ముగించుకొని నేడు ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి, తనను ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

ADVERTISEMENT

ఏపీలో బిజెపిని బలోపేతం చేస్తానని, అదేవిదంగా ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతానని ట్వీట్‌ చేశారు. ఆమె నోట ఆ మాట వినపడినందుకు చాలా సంతోషం!

గత నాలుగేళ్లుగా ఆమె ఏపీ బిజెపిలోనే ఉన్నప్పటికీ చురుకుగా రాజకీయాలలో పాల్గొనడం లేదు. ఏపీలో జరుగుతున్న అరాచకాలు, అత్యాచారాలు, వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు దేనిపైనా పెద్దగా స్పందించలేదు. కనీసం అమరావతి, పోలవరం, అప్పుల గురించి కూడా ఆమె పెద్దగా మాట్లాడలేదు. వైసీపీతో తమ పార్టీకి రహస్య సంబందం లేదని నిరూపించేందుకు రాష్ట్ర బిజెపి చేపట్టిన కార్యక్రమాలలో పాల్గొనడం మినహా రాజకీయాలకు దూరంగానే ఉన్నారని చెప్పవచ్చు.

ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించింది కనుక అన్నిటి గురించి తప్పనిసరిగా మాట్లాడవలసివస్తుంది. అన్నిటికంటే ముందుగా వైసీపీ, టిడిపిల పట్ల బిజెపి వైఖరిని స్పష్టం చేయవలసి ఉంటుంది.

వైసీపీని శత్రువుగా పరిగణిస్తున్నామని బిజెపి చెప్పినప్పటికీ, ఆచరణలో కేంద్ర ప్రభుత్వం అందుకు పూర్తిభిన్నంగా వ్యవహరిస్తుండటంతో ఏపీ బిజెపి నేతల మాటలను, వారి విమర్శలను రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మడం లేదు.

కనుక ముందుగా బిజెపి విశ్వసనీయతను పెంచుకోవలసి ఉంటుంది. ప్రజల ఆకాంక్షలతో ముడిపడున్న అమరావతి, పోలవరం గురించి ఆమె మాట్లాడవచ్చు. ఎందుకంటే అదే సులువు. కానీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ, ఏపీకి ప్రత్యేకహోదా, విశాఖ నుంచి చెన్నైకి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి అంశాల గురించి మాట్లాడలేని పరిస్థితి. ఏపీ ప్రయోజనాలను కాపాడటమంటే ఇవి కూడా ఉన్నాయి కదా?

అయితే ఇప్పటికిప్పుడు ఆమె ఏపీకి ఏదో సాధించి తీసుకురావడం అసాధ్యం కనుక బిజెపి విశ్వసనీయతను పెంచడం కూడా అసాధ్యమే. కనుక ఆమె ఏపీ రాజకీయాలపై మాత్రమే దృష్టి పెట్టి ముందుకు సాగవచ్చు. ఈ ప్రయత్నంలో ఆమె జనసేన,బిజెపిలు కలిసి పనిచేసేలా కార్యాచారణ రూపొందించవచ్చు.

ఇక టిడిపితో పొత్తులో కత్తులో తేల్చేసుకోక సమయం వచ్చేసింది కనుక అది తేల్చేయవచ్చు. టిడిపి పొత్తులైనా, కత్తులైనా రెండూ ఆమెకు ఇబ్బందికరమే అని చెప్పొచ్చు.

ఆమె నేతృత్వంలో ఏపీ బిజెపి వైసీపీతో యుద్ధం ప్రారంభించవచ్చు కానీ మోడీ, అమిత్‌ షాలతో సిఎం జగన్‌, విజయసాయి రెడ్డి ఫోటోలు దిగి తమ పేపర్లో వేసుకొంటున్నప్పుడు ఆమె ఎంత పోరాటం చేసినా వృధాయే.

చివరిగా ఒక మాట. ఆమె తండ్రి ఎన్టీఆర్‌ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు ఎంతగా తపించేవారో అందరికీ తెలుసు. కనుక దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఆ తండ్రికి తీసిపోనని నిరూపించుకొనేందుకు ఈ పదవి ఓ గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. మరి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఏవిదంగా ఉంటుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories