వైసీపి పాలనలో బాధితులనే నేరస్తులుగా చూపే ప్రయత్నాలు కొత్తేమీ కాదని నిరూపిస్తూ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వైఎస్ వివేకా హత్య కేసుపై విచారణ జరిపిన సీబీఐ అధికారి రాంసింగ్, ఆ కేసులో బాధితులైన వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి దంపతులపై వేర్వేరు కోర్టులలో వేర్వేరు కారణాలతో కేసులు నమోదయ్యాయి.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41ఏ కింద నోటీసులు అందుకొన్న నారా లోకేష్, నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎర్రడైరీ చూపించి పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారంటూ ఏపీ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఆ కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని ఏపీ సీఐడీ కోరగా ముందు ఆయనకు నోటీస్ పంపించాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9కు వాయిదా వేసింది. కనుక నారా లోకేష్ చేతిలో ఏపీ సీఐడీ అధికారులు నోటీస్ పెట్టేశారు.
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారి రాంసింగ్, సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి తనను తప్పుడు సాక్ష్యం ఇవ్వాలంటూ తీవ్ర ఒత్తిడి చేశారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి డిసెంబర్ 15వ తేదీన పులివెందుల కోర్టులో ఓ పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశం మేరకు పులివెందుల పోలీస్ స్టేషన్‌లో వారు ముగ్గురిపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపి జనవరి 4వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని పులివెందుల కోర్టు ఆదేశించింది.
వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్న డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచి తమకు వైసీపి నేతల నుంచి వేధింపులు మొదలయ్యాయని అతని భార్య షబానా ఆరోపిస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో ఓ అమ్మాయిని దస్తగిరి కిడ్నాప్ చేశారని ఫిర్యాదు రావడంతో ఎర్రగుంట్ల పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేసి అక్టోబర్ 31న అరెస్ట్ చేశారు. ఆ కేసుతో తన భర్తకు ఎటువంటి సంబంధం లేకపోయినా వైసీపి నేతలే ఈ కేసులో తన భర్తని ఇరికించి బెయిల్ రాకుండా అడ్డుకొంటున్నారని దస్తగిరి భార్య షబానా ఆరోపిస్తున్నారు.
కానీ గమ్మతైన విషయం ఏమిటంటే, వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఎన్నడూ వినపడదు! సీబీఐ అధికారులు ఏపీలో ధైర్యంగా విచారణ చేయలేకపోతున్నారని సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ కేసు విచారణను హైదరాబాద్‌కు మార్పించినా ఎటువంటి పురోగతి లేకపోవడం గమనిస్తే సీబీఐ, కోర్టులు, వ్యవస్థలు, చట్టాలు ఎంత నిసహాయమైనవో అని అనిపించకమానదు.




