రాష్ట్రానికి రాజధానే లేదు, రాజధానికి ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసులు మాత్రం నమోదుచేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లింది. చూడని హత్యకు సాక్ష్యం చెప్పినట్టు..,లేని రోడ్డుకు కేసులు వేయడం ఏమిటో ఆ సాక్షికే తెలియాలి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి విచారణ ఎదుర్కోవడానికి ఢిల్లీ నుంచి తాడేపల్లి సిఐడి ఆఫీసుకు చేరుకున్నారు నారాలోకేష్.
ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్లో ఎన్ని మలుపులు ఉన్నాయో ఎవరికీ తెలియదు కానీ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాత్రం మలుపులుకు కొదవేలేదు.విచారణ మొదలు పెట్టిన రోజే ఇప్పటివరకు ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న సిఐడి అడిషనల్ ఎస్పీ జయరామరాజు ను తప్పిస్తూ ఆయన స్థానంలో డీస్పీ విజయభాస్కర్ ను నియమిస్తున్నట్లు సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు.
ప్రభుత్వ అనుమతితోనే ఆ విచారణాధికారి మార్పు జరిగిందా లేక ఆ అధికారే ఇటువంటి తలా తోక లేని కేసులలో తన భాగస్వామ్యం ఉండకూడని భావించారో కానీ మొత్తానికి కేసులో మార్పులు మొదలయ్యాయి. ఈ మార్పుల కూర్పులతో జగన్ తానూ అనుకున్నట్టుగానే లోకేష్ ని కూడా కటకటాల వెనుకకు పంపిస్తారా? లేదా? అనేది కాలమే సమాధానం చెప్పగలిగే ప్రశ్నగా మిగిలింది!
ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారణ జరపవలసిన ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకోవడం వలన బాబు పిటిషన్ ఈ రోజు విచారణకు రాలేకపోయింది. విచారణ చేపట్టిన అధికారి మారిపోతున్నారు, విచారణ జరపవలిసిన న్యాయమూర్తి కోర్టుకు రాలేకపోతున్నారు, మరికొన్ని కేసుల విచారణలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.
మరీ కొన్ని పిటిషన్ల విచారణకు హైకోర్టులో అనుమతి కరువుతుంది ఇలా ఎటు చూసినా ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న మలుపులు కన్నా కేసు విచారణలో ఉండే మలుపులు ఘాటీ రోడ్డుని తలపిస్తుంది. ఈ మలుపులను దాటి గెలుపు గమ్యాన్ని చేరేదెవరో? పుష్పాన్ని అందుకునేదెవరో? రాజకీయ పెద్దలకే తెలియాలి!



