వచ్చే నెలలో ఢిల్లీలో గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ (జీసీపీఎంహెచ్) ఆఫ్ ఇండియా 3వ ఎడిషన్ సదస్సు జరుగనుంది. దీనిలో పాల్గొనవలసిందిగా కేంద్ర రసాయన మరియు పెట్రోకెమికల్స్ శాఖ కార్యదర్శి అరుణ్ బరోకా ఏపీ సీఎస్ జవహార్ రెడ్డిని ఆహ్వానించారు.
ఢిల్లీ నుంచి వచ్చిన అరుణ్ బరోక బృందంతో జవహార్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు సుదీర్గంగా చర్చించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలియం, కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో అగ్రగామిగా ఉందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు.
Also Read – మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?
రాష్ట్ర వ్యాప్తంగా గల పారిశ్రామికవాడలు, వాటిలో కెమికల్స్, పెట్రో కెమికల్ కంపెనీల వివరాలను అరుణ్ బరోకాకు వివరించారు. తిరుపతి సమీపంలో గల శ్రీసిటీలో నడుస్తున్న పరిశ్రమలు, వాటి ఉత్పత్తుల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా పరిశ్రమలు ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని జవహార్ రెడ్డి కేంద్ర బృందానికి వివరించారు.
పెట్రోలియం, కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని జవహర్ రెడ్డి చెప్పారు.
Also Read – మిల్వాకీ లో ATA ఉమెన్స్ డే మరియు ఉగాది వేడుకలు
అవును! ఏపీలో లేనిదంటూ లేదు. సువిశాలమైన సముద్రతీరం ఉంది కనుక ఎక్కడికక్కడ ఓడరేవులు నిర్మించుకొంటే చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఏపీ నుంచే విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేసుకోగలవు. సముద్ర గర్భం నుంచి ముడిచమురు తీసే అవకాశం ఉంది. రాష్ట్రంలో చేపలు, రొయ్యలు పెంపకాలు, ప్రాసెసింగ్ యూనిట్లు అనేకం ఉన్నాయి. వాటికి మరికాస్త చేయూత నందిస్తే చాలు… అక్వారంగమే ఏపీని పోషించగలదు. సముద్రతీరం అంటే పర్యాటక ఆకర్షణ కేంద్రం. కాస్త శ్రద్దపెట్టి అభివృద్ధి చేసుకొంటే అదీ రాష్ట్రానికి కాసులు కురిపించగలదు.
రాష్ట్రం గుండా అనేక నదులు పారుతున్నందున ఏపీ వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా ఎప్పటి నుంచో గుర్తింపు కలిగి ఉంది. కానీ రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలకు మరికాస్త సాగునీటి వసతి కల్పించగలిగితే అక్కడి రైతులు బంగారం పండించగలరు. నదులు వాటి కాలువలు ఉన్నందున జలారవాణాకు, పర్యాటకానికి అద్భుతమైన అవకాశం ఉంది.
Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
ఏపీలో పేరు మోసిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు, ఐటి నిపుణులు, వివిద రకాల ప్రాజెక్టులు నిర్మించగల కాంట్రాక్టర్లు, రవాణా, సినీ రంగంలో ఎంతో అనుభవం ఉన్నవారు కోకొల్లలున్నారు. వారి ప్రతిభను, పెట్టుబడులను, సేవలను ఇతర రాష్ట్రాలు ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతున్నాయి. కానీ పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్లు వారిని ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోలేకపోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజవనరులు, మానవ వనరులు రెండూ పుష్కలంగా ఉన్నాయని స్పష్టం అవుతోంది. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఏపీ అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయింది. కారణాలు అందరికీ తెలిసినవే. వాటి గురించి చెప్పుకోవాలంటే మరో పది అధ్యాయాలు చెప్పుకోవలసి ఉంటుంది.