సోషల్ మీడియాను సరిగ్గా వాడితే ప్రయోజనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అన్న దానికి నిదర్శనంగా నిలిచే ఉదంతం ఇది. శ్రీకాకుళం జిల్లాలోని భీమునిపాలెం, లావేరు మండలం, అడపాక పంచాయితీలో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ఆవరణలో నిలిచిపోయిన వర్షపు నీటిని ఫోటోలు తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించే వరకు ఈ పోస్ట్ ల ఒరవడి కొనసాగుతూనే ఉంది.
‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా’ అన్న చందంగా… ఈ ఫోటోలను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్, తక్షణమే అధికారులను ఆదేశించడం.., మరుసటి రోజే దీనిని పరిశుభ్రం చేయించడం… పనులన్నీ అలా గంటల్లో పూర్తైపోయాయి. అంతేకాదు, పరిశుభ్రం అవుతున్న ఫోటోలు కూడా ట్విట్టర్లో ప్రత్యక్షం అయ్యాయి. వీటిని నారా లోకేష్ కూడా షేర్ చేస్తూ… ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపారు.
సోషల్ మీడియాను వినియోగించుకుని ప్రభుత్వం చేత పనులు ఎలా చేయించుకోవచ్చో ఈ సంఘటనను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కేవలం ట్విట్టర్ లోని నెటిజన్ల వలనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, ఈ సమస్యపై దృష్టి సారించేలా చేసింది. అయితే వెనువెంటనే పనులు చేయడంతో నెటిజన్లు కూడా ఏపీ సర్కార్ తీసుకున్న చొరవపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.



