అంతిమ లబ్దిదారు జగనే.. అయితే ఏంటి?

AP Liquor Scam: Satya Prasad Seeks Approver Status

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ హయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు బయటపడింది. అప్పట్లో అది చాలా సంచలనం సృష్టించింది.

మొదట్లో ఏదో జరిగిపోబోతోందని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ ఏమీ జరుగలేదు. దాని తర్వాత ఆ మద్యం రవాణా అంటూ మరో కుంభకోణం.. మళ్ళీ అదే హడావుడి..తర్వాత మళ్ళీ సైలన్స్.

ADVERTISEMENT

వివేకాను హత్య చేసింది ఎవరో అన్నట్లు ఈ మద్యం కుంభకోణం చేయించింది ఎవరో తెలిసి ఉన్నా ప్రభుత్వం అంతిమ లబ్దిదారుని టచ్‌ చేయలేకపోవడంతో ఈ కేసు విచారణలు, అరెస్టులు, జైలు, బెయిలు స్టోరీలు చూసి చూసి ప్రజలకు కూడా బోర్ కొట్టేసింది.

మళ్ళీ ఇంతకాలం తర్వాత ఈ కేసులో పెద్ద విస్పోటనం జరిగింది. నాడు జగన్‌ హయంలో ఏపీఎస్ బీఏసీఎల్‌కు ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ)గా వ్యవహరించిన సత్యప్రసాద్, అకస్మాత్తుగా ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్‌ వేశారు.

ఈ కేసులో తాను ‘అప్రూవర్’గా మారేందుకు అనుమతించాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఎదుట ఆయన ఇచ్చిన వాంగ్మూలమే వైసీపీ నెత్తిన ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి నెత్తిన బాంబులా పడిందని చెప్పవచ్చు.

సత్యప్రసాద్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో వివరాలు క్లుప్తంగా..

· మద్యం కుంభకోణం ప్లానింగ్ మొత్తం తాడేపల్లి ప్యాలస్‌లో జగన్‌ సమక్షంలోనే జరిగింది.

· నెలకు 50-60 కోట్లు వసూళ్ళు వస్తాయని లెక్కలు కట్టారు.

· దీనిలో విజయసాయి రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, అనిల్ రావిపూడి రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డితో సహా మొత్తం ఓ 20-30 మందిపైనే ఉన్నారు.

· మద్యం కంపెనీలలో దేనికి ఆర్డర్ ఇవ్వాలి? ఎంత కమీషన్ తీసుకోవాలి? ఆ సొమ్ముని వివిధ మార్గాలలో ఏవిధంగా జగన్‌కు అందించాలనే ప్రతీదీ ముందే ప్లాన్ చేసుకొని అంతే ఖచ్చితంగా అమలుచేశారు.

· చాలా పకడ్బందీ ప్రణాళికతో అమలుచేస్తూ అందరూ తలాకాస్త కమీషన్లు తీసుకుంటూ, పెద్ద మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తూ ఉండేవారు.

· మద్యం కుంభకోణంలో ఇంకా అనేక మినీ కుంభకోణాలు కూడా జరిగాయి. రవాణా, ఫీల్డ్ మానిటర్స్, అవుట్ సోర్సింగ్ నియామకాలు, వాహనాల కాంట్రాక్టులు వగైరా వగైరా.

· ప్రభుత్వం మారితే ఈ కేసులో దొరక్కుండా తప్పించుకునేందుకు కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి తదితరులు ఓ కమిటీగా ఏర్పడి పక్కా ప్లానింగ్ ప్రకారమే రికార్డులు, నోట్ ఫైల్స్, ఇతర డాటా, ఆధారాలు ధ్వంసం చేశారు.

సత్యప్రసాద్ ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా చాలా వివరాలు వాంగ్మూలం ద్వారా ఏసీబీ కోర్టుకు ఇచ్చారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా జగన్మోహన్ రెడ్డే అని తేల్చి చెప్పేశారు.

కనుక ఏసీబీ అధికారులు జగన్‌కు నోటీస్ జారీ చేసి విచారణకు పిలుస్తారా? ఆయనని అరెస్ట్ చేస్తారా? అని మళ్ళీ అందరూ చర్చించుకుంటున్నారు.

కానీ ఒకవేళ అరెస్ట్ చేసినా ఇలాంటి కేసులతో ఫుట్ బాల్ ఆడుకోగల నేర్పు జగన్‌కి, వైసీపీ నేతలకు ఉంది. కనుక ఈ కథ అరెస్ట్ వరకు వెళ్తే తర్వాత జైలు, బెయిల్‌ స్టోరీలు మళ్ళీ మామూలే.

కనుక ఈ తాజా పరిణామాలు చూసి ఎవరూ ఆందోళన, ఆవేశం చెందాల్సిన అవసరమే లేదు.

ADVERTISEMENT
Latest Stories