రాష్ట్ర విభజన తర్వాత సిఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తరచూ ‘లెవెల్ ప్లేయింగ్’ అవసరమని చెప్పేవారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందినా హైదరాబాద్‌తో ధనిక రాష్ట్రంగా అవతరించింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేని వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలింది. కనీస ఆదాయం, రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
కనుక ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయ పడాలని సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే విజ్ఞప్తి చేస్తుండేవారు. కానీ వివిధ కారణాల చేత ప్రధాని మోడీ రాష్ట్రానికి చెంబుడు నీళ్ళు, మట్టి మాత్రమే ఇచ్చారు!
కానీ చంద్రబాబు నాయుడు అధైర్య పడలేదు. అమెరికా వంటి అగ్రదేశాలతో సమానంగా ఎదిగేందుకు భారత్ ఏవిదంగా కృషి చేస్తోందో, అదేవిధంగా ఆయన కూడా దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా ఎదిగేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేశారు. ఆ తర్వాత జరిగిన కథలన్నీ అందరికీ తెలుసు.
ఇప్పుడు ఆ కధ మారింది. ఒకప్పుడు తెలంగాణ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతకు రెట్టింపు వేగంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతోంది.
నేటికీ ‘రప్పా రప్పా’ భయాలు వెంటాడుతున్నప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడు కృషి, పరపతి, నమ్మకం వలన పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు ఏపీకి తరలి వస్తున్నాయి.
ఒకప్పుడు అందరూ ఏపీని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణతో పోల్చి చూస్తూ జాలి పడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయ్యింది. ఇప్పుడు అందరూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీతో తెలంగాణని పోల్చి చూస్తున్నారు. కనుక సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది.
కనుక ఆయన కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో పోటీ పడుతూ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టారు.
అలాగే డిసెంబర్ 8,9 తేదీలలో హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. దానిలో దేశ విదేశాలకు చెందిన పలు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీలు, వాణిజ్య తదితర వివిధ రంగాలకు చెందిన సంస్థల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు.
హైదరాబాద్ ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది. ఎంతగా అంటే, రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
1. దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ‘స్కైరూట్’ అనే కంపెనీ తొలి ఉపగ్రహ వాహక నౌక విక్రమ్-1 తయారు చేసింది. త్వరలో ఉపగ్రహ ప్రయోగాలు కూడా చేయబోతోంది.
2. కేసీఆర్ హయంలో కోకాపేటలో ఎకరం కోటి రూపాయలు పలికితే అందరూ నోరు వెళ్ళబెట్టారు. కానీ ఇప్పుడు అక్కడే ఎకరం రూ.1.53 కోట్లు పలుకుతోంది.
ఇవన్నీ హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనాలుగానే భావించవచ్చు. కనుక ఈ సదస్సులో తెలంగాణకు వివిధ రంగాలలో భారీ పెట్టుబడులు రావడం తధ్యం.
ఒకప్పుడు వెనుకబడిన ఏపీ తెలంగాణతో ‘లెవెల్ ప్లేయింగ్’ దశకు చేరుకోగా, తెలంగాణ తన స్థాయిని మరింత మెరుగుపరుచుకొని ఏపీకి గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది.
ఒకప్పుడు కత్తులు దూసుకున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఈవిదంగా అభివృద్ధిలో పోటీ పడుతుండటం చాలా అభినందనీయమే… అవసరమే.
నాడు సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే ‘అభివృద్ధిలో పోటీ పడదాం,’ అని కేసీఆర్‌కు చెప్పేవారు. కానీ ఆయన రాజకీయాలు చేస్తూ ఏపీని, చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయాలని ప్రయత్నించారు.
కానీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరూ పొరుగు రాష్ట్రాల అభివృద్ధి చూసి ఏమాత్రం ఈర్ష్య పడకుండా, ఈవిదంగా అభివృద్ధిలో పోటీ పడుతుండటం చాలా శుభ పరిణామం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో నం.1 రాష్ట్రాలుగా నిలవడం ఖాయం.




