నవంబర్ 30వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ తర్వాత మార్చి నెలాఖరులోగా ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి.
తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కొబోతున్న అధికార బిఆర్ఎస్ పార్టీ, తమ హయాంలో జరిగిన రాష్ట్రాభివృద్ధిని, అమలవుతున్న సంక్షేమ పధకాలను చూసి ఓట్లేయమని కోరుతోంది. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలు నమ్మి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని వాటి చేతుల్లో పెడితే మళ్ళీ మొదటికొస్తుందని, కనుక ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరుతోంది.
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బిఆర్ఎస్ నేతలు అందరూ అభివృద్ధి మాటున భారీగా అవినీతికి పాల్పడుతూ వేలకోట్లు పోగేసుకొన్నారని, కనుక మళ్ళీ వారిని నమ్మి మరోసారి అధికారం ఇస్తే, కేసీఆర్ రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తారని కాంగ్రెస్, బీజేపీలు వాదిస్తున్నాయి.
ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ వైసీపి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే 2024లో జరుగబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచుతోంది. పరిశ్రమలు, ఐటి కంపెనీలు తేకుండా సంక్షేమ పధకాలతోనే ప్రజల జీవితాలు మారిపోతున్నాయని గట్టిగా నమ్మబలుకుతోంది. తమ వాదనలు నిజమని ప్రజలను నమ్మించేందుకు వైసీపి నేతలు బస్సు యాత్రలకు కూడా సిద్దమవుతున్నారు.
ఈ విపరీత ధోరణి కారణంగా అమరావతి, పోలవరం మొదలు అనేక ప్రాజెక్టులు మూలపడ్డాయని, రాష్ట్రంలో హత్యలు, అరాచకాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలు, రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని, రాష్ట్రంలో రావణకాష్టంలా మారిందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టిడిపి, జనసేనలు వాదిస్తున్నాయి. కనుక జగన్మోహన్ రెడ్డిని అత్యవసరంగా గద్దె దించకతప్పదని వాదిస్తున్నాయి. టిడిపి, జనసేనలు కూడా తమ వాదనలను బలంగా వినిపిస్తున్నాయి.
కనుక అక్కడ తెలంగాణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి భిన్నంగా ఉండే ఈ వాదనలలో ఏవి నిజమో ఏవి అబద్దాలో తేల్చుకొని తగిన పార్టీని ఎన్నుకోవలసి ఉంటుంది. కనుక ఈ ఎన్నికలు తెలుగు ఓటర్ల విజ్ఞతకు, విచక్షణకు పరీక్ష వంటివే అని చెప్పవచ్చు. మరి ఈ పరీక్షలు ప్రజలే నెగ్గుతారో వారిని మభ్యపెట్టి రాజకీయ పార్టీలే నెగ్గుతాయో చూడాలి.






