ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసేపటి క్రితం నాలుగు గంటలు సుధీర్ఘంగా ప్రసంగించి ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి వివరణగా చెప్పారు. అయితే చంద్రబాబు స్పీచ్ అయినా ఒక గంట తరువాత ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి అన్నట్టుగా అదే పాత పాట పాడారు.
ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం తమకు తెలుసని, ఆ రాష్ట్రంపై తమకు సానుభూతి ఉంది అంటూనే ఇప్పటికే చాలా చేసేశామని ఇక ఏమి చెయ్యలేమని కుండ బద్దలుకొట్టారు. ఒకానొక దశలో మాకు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు కదా ఇంకా దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా అని, మరొక సారి తాము దేశభద్రత కూడా చూసుకోవాలని చెప్పుకొచ్చారు.
ఆయన వాదన ఎంత ఘోరంగా ఉందంటే… ఒక విలేకరి వెనుకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు 50 కోట్లు ఏంటి అని అడిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం వారు ఇంకాస్త ఖర్చుపెట్టుకుంటారు అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదన్నారు. స్టేటస్ అనే పదం వాడకుండా సాయం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.



