మీరు అభివృద్ధి చేయండి.. మేము దుష్ప్రచారాలు చేస్తాము!

AP electric buses at APSRTC depot

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరిగి ఎన్నటికైనా కోలుకోగలదా లేదా? అని ప్రజలు ఆందోళన పడిన సమయంలో సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్కులు, వాటిలో ఏర్పాటవుతున్న పరిశ్రమలు, ఐటి కంపెనీల గురించి ఇరుగు పొరుగు రాష్ట్రాలు ప్రజలు సైతం మాట్లాడుకుంటున్నారు.

ADVERTISEMENT

అదేవిధంగా శరవేగంగా నిర్మితమవుతున్న ఏపీ రాజధాని అమరావతి గురించి దేశవ్యాప్తంగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కేవలం రెండేళ్ళలో ఇంత వేగంగా ఇంత మార్పు రావడం చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చాలా సంతోషిస్తున్నారు.

అయితే కూటమి ప్రభుత్వం ఓ పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే మరోపక్క నిరంతరంగా ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాలను ఎదుర్కోక తప్పడం లేదు. ముఖ్యంగా అమరావతి విషయంలో చేస్తున్న కుట్రలను నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు అడ్డుకోవాల్సి వస్తోంది.

రాష్ట్రంలో ఈ దుష్ప్రచారాలు ఎంతగా మితిమీరిపోయాయంటే, రోడ్లపైకి వస్తున్న 750 విద్యుత్ బస్సులని కూడా విడిచిపెట్టలేదు. వాటిని చూపుతూ, ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేస్తోందని దుష్ప్రచారం మొదలైపోయింది.

కానీ వాస్తవం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సులు రాయితీపై అందజేస్తోంది. ఈ పధకంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏపీకి 750 విద్యుత్ బస్సులు మంజూరు చేసింది. వాటిని చూపిస్తూ దుష్ప్రచారం జరుగుతోంది.

ఈ పధకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వమే ‘గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్’ (వెట్ లీజు) పద్ధతిలో టెండర్లు పిలిచి ఈ విద్యుత్ బస్సుల పూర్తి బాధ్యత ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. కనుక వాటికి ఆయా కాంట్రాక్టర్ తరపున డ్రైవర్లు ఉంటారు. ఈ బస్సుల నిర్వహణ, మరమత్తులు, డ్రైవర్ జీతం కోసం కేంద్ర ప్రభుత్వమే కి.మీ.కు రూ.24 చొప్పున గ్రాంట్ ఇస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఒకేసారి 750 ఎలక్ట్రిక్ బస్సులు పొందడమే కాకుండా, వాటి కోసం కేంద్రం నుంచి రూ.1,774 కోట్లు అందుతాయి.

ఈ విషయాలన్నీ సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. కనుక కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేస్తోందని రోడ్లపై తిరుగుతున్న ఈ ప్రైవేట్ బస్సులే ఇందుకు నిదర్శనమని దుష్ప్రచారం జరుగుతోంది.

ఈవిధంగా ప్రతీ దానిపై దుష్ప్రచారం జరుగుతుండటం కూటమి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కనుక వాటిని గమనిస్తూ ఎప్పటికప్పుడు ఖండిస్తుండటం, ప్రజలకు వివరణ ఇచ్చుకోవడం తప్పనిసరి అయ్యింది. లేకుంటే ఊహించని కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా ఈ తలనొప్పులు భరించక తప్పడం లేదు.

ADVERTISEMENT
Latest Stories