ఒకప్పుడు కేసీఆర్‌లో కనిపించిన ఆంద్ర పట్ల ద్వేషం ఇప్పుడు ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తన తండ్రి ఆ పద్దతిలో రాజకీయంగా రాణించారు కనుక తాను కూడా అదే పద్దతిలో రాణించవచ్చని ఆమెభావిస్తున్నట్లున్నారు. అందుకే ‘అనగనగా ఒకరాజు.. అంటూ మొదలుపెట్టి మద్యలో ‘ఆంధ్రావాళ్ళు’ అంటూ చులకన మాట్లాడి కథ ముగిస్తుంటారు.
ఇంతకాలం ఆమె ప్రసంగానికి ముందు చివర్లో ‘జై తెలంగాణ’ అని నినాదం చేసేవారు. అది మరిచిపోయి ఆంధ్రావాళ్ళు అంటున్నారిప్పుడు. ‘నా ప్రేమను కోపంగానో.. నా ప్రేమను ద్వేషంగానో.. ఫీల్ మై లవ్’ అని హీరో పాడినట్లు ఆమె కూడా ఆంధ్రా, చంద్రబాబు నాయుడుని తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే, ‘టీఆర్ఎస్’ పేరు తాను ఉపయోగించుకోనీయకుండా తన అన్న కేటీఆర్, భావించవచ్చు. హరీష్ రావు ఇద్దరూ దున్నపోతులు, ఆంబోతుల్లా అడ్డుపడుతున్నారంటూ ఆమె నిప్పులు చెరిగారు. “తల్లీ చెల్లి అనే ఇంగితం కోల్పోయి ఇద్దరికిద్దరూ సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తున్నారు. వారి మూకలు నా ఫోటోని మార్ఫింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయి.
ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీతో కలిసి నువ్వు (కేటీఆర్) చేసిన అక్రమ దోపిడీల గురించి నేను ప్రశ్నిస్తూనే ఉంటా. దమ్ముంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఇది ఆంధ్రా కాదు అడ్డమైన తిట్లు తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి. సభ్యత సంస్కారం కలిగిన తెలంగాణ సమాజం ఇది. దమ్ముంటే నన్ను రాజకీయంగా ఎదుర్కో,” అంటూ కవిత విరుచుకు పడ్డారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్‌పై రాజకీయంగా పైచేయి సాధించలేక ఆంధ్రా, చంద్రబాబు నాయుడు, నీళ్ళ దోపిడీ అంటూ కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ సెంటిమెంట్ రాజేసి ప్రజలను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వారి ఈ బలహీనతే కల్వకుంట్ల కవితకు కూడా వైరస్‌లా సోకినట్లుంది.
అయితే ఆంధ్రా పేరుతో రాజకీయాలు చేసుకొని రాజకీయంగా లబ్ది పొందాలని ఆరాటపడుతూ తమ సొంత బలాన్నే మరిచిపోతున్నారనిపిస్తుంది. తెలంగాణలో బిజేపి అధికారంలోకి వస్తే ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్ నేతలు ఆంధ్రా పేరుతో రాజకీయాలకు ముగింపు వస్తుందేమో?




