కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం అగస్టా కుంభకోణం కుదిపేస్తోంది. అలాగే బిజెపి పార్టీని ఇబ్బంది పెట్టేందుకు కూడా మోడీ డిగ్రీ పట్టా అంశం వెలుగులోకి వచ్చింది. అయితే ఇలాంటి అవకాశాలు దొరికితే ప్రత్యర్ధులపై విరుచుపడడం మన రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ, ఈ రెండు అంశాలలోనూ ఊహించినంత రచ్చ జరగకపోవడం గమనించదగ్గ విషయం. దీనిపై గురిపెట్టిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ రెండు పార్టీలను ఏకరువు పెట్టె ప్రయత్నం చేసారు.
అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాను అరెస్టు చేయించడానికి ప్రధాని మోడీ భయపడుతున్నారని, అంతేగాక, బీజేపీ, కాంగ్రెస్‌లకి మధ్య ఓ ‘సెటిల్‌మెంట్’ జరిగిందని ఆరోపణలు గుప్పించారు. దాని ప్రకారమే ప్రధాని మోదీ నకిలీ డిగ్రీపై కాంగ్రెస్ పార్టీ గళం విప్పట్లేదని, అలాగే అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం కేసులో సోనియా గాంధీని బిజెపి అరెస్టు చేయట్లేదని విమర్శలు చేసారు.
సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ తో పాటు పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతల పేర్లను ఇటాలియన్ కోర్టు తన తుది తీర్పులో ప్రకటించిందని, అయినప్పటికీ సోనియా గాంధీని అరెస్టు చేయడానికి మోడీకి ధైర్యం చాలడం లేదని కేజ్రీవాల్ రెండు పార్టీలను ఇరుకున పెట్టే విధంగా ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే, ఇటాలియన్ కోర్టు తీర్పును ఆధారంగా తీసుకుని ఈ, కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.



