ధరణిపై విచారణకు సిట్‌.. బీఆర్ఎస్‌పై యుద్ధ ప్రకటనే!

Dharani Portal SIT probe in Telangana

బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధరణి పోర్టల్’ ద్వారా భారీగా అక్రమాలు, భూముల బదలాయింపులు జరిగాయంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి పోర్టల్ ప్రవేశపెట్టింది.

ఈరోజు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘ధరణి పోర్టల్’ ద్వారా జరిగిన అక్రమాలు, భూబదలాయింపులు, ఆర్ధిక లావాదేవీలపై ‘సిట్‌’ చేత విచారణ జరిపించాలని నిర్ణయించారు.

ADVERTISEMENT

కేసీఆర్‌ కుటుంబం, బీఆర్ఎస్‌ నేతలు భూములు ఆక్రమించుకునేందుకే ‘ధరణి పోర్టల్’ తెచ్చారని ఇదివరకు సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఆరోపించేరు. ఇటీవల ఓ సభలో కూడా కల్వకుంట్ల కుటుంబంలో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎనెన్ని ఎకరాలున్నాయో కూడా ప్రజలకు వివరించి, వారికి అన్ని వందల ఎకరాలు ఎలా వచ్చాయని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కనుక ‘ధరణి పోర్టల్’ లావాదేవీలపై సిట్‌ విచారణ అంటే బీఆర్ఎస్‌ పార్టీపై మరో కొత్త యుద్ధ ప్రకటన చేసినట్లుగానే భావించవచ్చు. దీనిపై కేటీఆర్‌, హరీష్‌ రావు, కల్వకుంట్ల కవిత తదితరులు ఏవిధంగా స్పందిస్తారో తేలికగానే ఊహించవచ్చు. అయితే వారి చేతికి కూడా ‘భూభారతి పోర్టల్’ ఓ ఆయుధం అందించింది.

ఈ పోర్టల్స్ మార్పిడి సమయంలో, కొత్త పోర్టల్ రూపొందిస్తున్నప్పుడు, అది ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నప్పుడు, అది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ దశలో అనేక అక్రమ లావాదేవీలు జరిగాయంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. కొందరు నాయకులు, అధికారులు కలిసి ప్రభుత్వ భూములను కూడా తమ బినామీల పేరిట రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారనే ఆరోపణలు వినిపించాయి.

కనుక ‘ధరణి లావాదేవీలపై విచారణకు ‘సిట్‌’ వేస్తే పనిలో పనిగా కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ‘భూభారతి పోర్టల్’ లావాదేవీలపై కూడా సిట్‌ చేత విచారణ జరిపించాలని బీఆర్ఎస్‌ నేతలు పట్టు బట్టవచ్చు. అప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అవునని, కాదనలేని పరిస్థితి ఏర్పడవచ్చు.

త్వరలో జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు ఈ కొత్త అస్త్ర శస్త్రాలు బయటకు తీస్తున్నాయి కనుక ఎన్నికలు పూర్తయ్యే వరకు వాటి యుద్ధం ధాటిగానే సాగవచ్చు.

చివరిగా ఒక ప్రశ్న. నిరుపేదలు గుడిసెలు, షెడ్లు వేసుకుంటే వెంటనే వెళ్ళి కూల్చేసే ప్రభుత్వం, సాక్షాత్ సిఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలలో మైకు పట్టుకొని ఎవరెవరు ఎంతెంత భూములు ఆక్రమించారో లెక్కలు చెపుతున్నప్పుడు, వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? బహుశః రాజకీయాలలో ఇదో రకం నైతిక విలువలు పాటించడంగా భావించాలేమో?

ADVERTISEMENT
Latest Stories