హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా పనిచేస్తున్న మజ్లీస్ పార్టీని ఆ గడప దాటకుండా కేసీఆర్ ఇన్నేళ్ళు కట్టడి చేశారు. ఏవిదంగా అనేది కేసీఆర్, ఓవైసీలకే ఎరుక.
అయితే ఇప్పుడు బిఆర్ఎస్-మజ్లీస్ బంధం బీటలువారుతున్నట్లుంది. లేదా వారుతున్నట్లు మళ్ళీ అందరినీ భ్రమింపజేస్తున్నట్లున్నారు. నిజామాబాద్ జిల్లా భోధన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్, స్థానిక మజ్లీస్ నేతలపై పోలీసు కేసులు పెట్టించి వారిని జైలుకి పంపించడంతో బిఆర్ఎస్-మజ్లీస్ బంధం బీటలు వారినట్లు అనిపిస్తోంది.
మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోమవారం బోధన్ వెళ్ళి వారిని జైల్లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత, షకీల్ గెలుపుకోసం మావాళ్ళు ఎంతగానో కృషి చేస్తే, నేడు వాళ్ళనే షకీల్ జైలుకి పంపారు. దీనికి ఆయన మూల్యం చెల్లించుకోక తప్పదు. వచ్చే ఎన్నికలలో భోధన్ నుంచి మజ్లీస్ పార్టీ పోటీ చేయడం, షకీల్‌ని ఓడించడం రెండూ ఖాయమే.
ఈసారి రాష్ట్రంలో మాకు బలం ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూడా పోటీ చేస్తాం. ఇంతకాలం కేసీఆర్‌తో దోస్తీకి కట్టుబడి రాజకీయంగా చాలా నష్టపోయాము. ఇకపై తెలంగాణలో మజ్లీస్ పార్టీ కూడా బిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు గట్టిగా కృషి చేస్తాం. వచ్చే ఎన్నికలలో మేము ఎవరితో పొత్తులు పెట్టుకొంటాము… ఎన్ని స్థానాలలో పోటీ చేస్తామనే విషయం త్వరలోనే ప్రకటిస్తాం,” అని ఓవైసీ అన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలలో మెల్లగా మార్పు వస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకొంటోంది. కర్ణాటక ఎన్నికలలో ముస్లింలందరూ గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. కనుక తెలంగాణలో ముస్లింలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారిప్పుడు. ఈ మార్పును మజ్లీస్ అధినేత ఓవైసీ కూడా గమించారు. కనుకనే ఈవిదంగా మాట్లాడి ఉండవచ్చు.
లేదా హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు మజ్లీస్, బిఆర్ఎస్ పార్టీలు హటాత్తుగా తలాక్ చెప్పేసుకొని పరస్పరం కత్తులు దూసుకొని ఎవరి సీట్లు వారు గెలుచుకొన్న తర్వాత మళ్ళీ కలిసిపోయిన్నట్లుగా, శాసనసభ ఎన్నికలలోనూ మరోసారి తలాక్ చెప్పేసుకొని కత్తులు దూసుకొంటున్నట్లు నటించేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్లు కూడా భావించవచ్చు.



