పెద్ద నోట్ల రద్దు పరిణామాల తర్వాత ఏటీఎంల ద్వారా మరియు చెక్కుల ద్వారా నగదు విత్ డ్రాలపై షరతులు విధించిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, జనవరి 1వ తేదీ నుండి కొంత కొంతగా వెసులుబాటు ఇచ్చుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఏటీఎంల నుండి ఒకేసారి 10 వేలు విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉండగా, వారానికి 24 వేల పరిమితి మాత్రం అలాగే ఉంది. కానీ, అతి త్వరలోనే ఈ షరతులన్నింటిని ఉపసంహరించుకునే విధంగా ఆర్బీఐ నుండి నిర్ణయం రాబోతోందని సమాచారం.
ప్రస్తుతం నగదు చలామణిలోకి వచ్చి సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో ఫిబ్రవరి నెలాఖరు నాటికి నగదుపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసే దిశగా ఆర్బీఐ ఆలోచనలు చేస్తోందని, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తా తెలిపారు. అంటే మరో నెల సమయం లోపునే నగదు విషయంలో ప్రజలు స్వేచ్చా జీవులు అవుతారన్న మాట. అయితే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాబోయే బడ్జెట్ లో నగదు విత్ డ్రాలపై ‘క్యాష్ టాక్స్’ను విధించనున్నారన్న టాక్ హల్చల్ చేస్తోన్న విషయం తెలిసిందే.



