ఇట్స్ క్రికెట్ – 38.5 ఓవర్లలో 488 పరుగులు!

Australia-Vs-New-Zealand-T20-Scoresక్రికెట్ హిస్టరీలో మొదటిసారిగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 243 పరుగుల భారీ స్కోర్ ను ఆస్ట్రేలియా ముందుంచింది. అసలు విషయం ఏమిటంటే… భారీ లక్ష్యాన్ని చూసి బెదిరిపోకుండా, ఆస్ట్రేలియా సదరు లక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే చేధించి, క్రికెట్ ప్రేమికుల పంట పండేలా చేసింది.

కివీస్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ గుప్తిల్ 54 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 పరుగులు చేసి సత్తా చాటాడు. మరో ఓపెనర్ మున్రో కూడా 33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి 76 పరుగులు చేసి, ఓపెనింగ్ కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. వీరిద్దరూ తప్ప మిగిలిన బ్యాట్స్ మెన్లు అంతా విఫలం కావడంతో 250 పరుగులు దాటుతుందనుకున్న స్కోర్ 243 పరుగుల వద్దే ముగిసింది. అంత భారీ స్కోర్ సాధించడంతో కీలకమైన ఈ మ్యాచ్ లో కివీస్ విజయం సాధించి, ఫైనల్లో మరోసారి ఆసీస్ తో సమరం ఖాయం అనుకున్నారు.

ADVERTISEMENT

తలచినదే జరిగితే క్రికెట్ లో మజా ఏముంటుంది… భారీ లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు కీలకపాత్ర పోషించారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 24 బంతుల్లో 59 పరుగులు చేయగా, మరో ఓపెనర్ షార్ట్ 44 బంతుల్లో 76 పరుగులు చేసారు. పునాదులు బలంగా వేయడంతో మిగిలిన బ్యాట్స్ మెన్లంతా తలో చేయి వేసి ఆస్ట్రేలియాను గెలిపించారు. దీంతో ఆడిన నాలుగు టీ 20లలోనూ విజయం సాధించి, ఆస్ట్రేలియా అగ్ర స్థానంలో నిలువగా, ఫైనల్ లో చోటు కోసం కివీస్ – ఇంగ్లాండ్ ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. నేడు జరిగిన మ్యాచ్ లో మొత్తం 38.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగా, ఏకంగా 488 పరుగులు నమోదయ్యాయి.

ADVERTISEMENT
Latest Stories