శ్రీరామ నవమి సందర్భంగా కడప జిల్లా, ఒంటి మిట్ట శ్రీరామాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్థానిక వైసీపీ నేతలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రజలకు ఓ దివ్య సందేశం ఇచ్చారు.
ఇంతకీ అవినాష్ రెడ్డి ఏమన్నారంటే, “ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ సీతారాములను కోరుకున్నాను. త్యాగానికి, ధర్మానికి ప్రతిరూపమైన ఆ శ్రీరాముడు గురించి భావి తరాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ప్రతీ వ్యక్తి ఆ శ్రీరామ చంద్రుడిని ఆదర్శంగా తీసుకొని ఓ మంచి కొడుకుగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి అన్నగా, మంచి స్నేహితుడిగా మెలగాలని నేను కోరుకుంటున్నాను,” అని అన్నారు. అవినాష్ రెడ్డి ప్రజలకి సందేశం ఇస్తున్నాననుకున్నారు. కానీ తమ పార్టీ అధినేత జగన్‌కు హితవు చెపుతున్నట్లనిపిస్తే ఆయన తప్పు కాదు.
ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డి తన తల్లినే కోర్టుకు ఈడ్చారు. చెల్లిని, ఆమె పిల్లలని మోసం చేశారు,” అని వైఎస్ షర్మిల తరచూ అన్నని నిందిస్తూనే ఉంటారు. ఆమె మాటలని పట్టించుకోకపోయినా జగన్ స్వయంగా తల్లిని, చెల్లిని పార్టీ నుంచి, రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేశారు కదా?
తల్లి, చెల్లి, చనిపోయిన బాబాయ్, ఆయన కూతురు, అల్లుడు గురించి తన పార్టీ నేతల చేత అనుచితంగా మాట్లాడించారు. తన సొంత మీడియాలో తన తల్లి తండ్రులను ధృతరాష్ట్రుడు, గాంధారితో పోల్చుతో వ్యంగ్యంగా వ్రాయించారు. కనుక అవినాష్ రెడ్డి మాటలు జగన్ కూడా ఓ మంచి కొడుకు, మంచి అన్నగా మెలగాలని సూచిస్తున్నట్లే అనిపిస్తుంది కదా?
అయినా బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి శ్రీరాముడి గురించి, ధర్మం, న్యాయం, త్యాగం అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది కదా?




