దక్షిణ భారతంలో పట్టు సాధించడానికి బీజేపీ పెద్దలు సర్వశక్తులు వడ్ఢినా ఫలితం మాత్రం మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఫలితాల మాదిరే రావడంతో గజని దండయాత్రలు మాదిరి బీజేపీ దక్షిణాదిన ఎన్నికల దండయాత్రలు చేస్తూనే వస్తుంది.
నిన్న కాకపోతే ఈ రోజు, ఈరోజు కాకపోతే రేపు…,ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రము అంటూ అలుపెరుగని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు బీజేపీ అధిష్టానం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. దీనికి అక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడం ఒక కారణం అయితే, రెండు తెలుగు రాష్ట్రాల పై కేంద్ర ప్రభుత్వ సీతకన్ను మరో కారణంగా చెప్పవచ్చు.
ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ కొంతవరకు ప్రభావాన్ని చూపగలుగుతుంది. ప్రతి ఎన్నికలకు తన పార్టీ ఓటు శాతాన్ని, సీట్ల సంఖ్యను క్రమక్రమంగా పెంచుకుంటూ ముందుకెళ్తుంది. గత ఎన్నికలలో తెలంగాణ నుంచి నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను కూడా ఓటమిపాలు చేసారు. ఇప్పుడు ఆసంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నాలు, ప్రచారాలు మొదలుపెట్టింది బీజేపీ.
గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 8 స్థానాలు దక్కించుకున్న బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమయ్యింది. అమితాషా ఈ నెల 28 న తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. మొదటి రోజు కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి చివరగా హైద్రాబాద్ లోని బీజేపీ నేతలు కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు.
ఇక ఏపీలో అయితే బీజేపీ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఆ పార్టీకి అంత గౌరవం అన్నట్లుగా ఉంటుంది ఆ పార్టీ పరిస్థితి. దక్షిణాదిన అందునా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎన్ని దండయాత్రలు చేసినా రాని ఫలితం బీజేపీ పార్టీకి అయోధ్య రామమందిర నిర్మాణంతో అయినా దక్కుతుందేమో వేచి చూడాలి మరి.




