ఇండియన్ సినీ ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఎదురుచూస్తున్న “బాహుబలి – ది కన్ క్లూజన్” ఆడియో విడుదలైంది. కీరవాణి సంగీతం అందించిన ఈ ఆల్బమ్ లో మొత్తం అయిదు పాటలు ఉన్నాయి. ఈ 5 పాటల్లో కూడా ‘హంస నావ’ అన్న ఒక్క డ్యూయెట్ సాంగ్ మినహాయిస్తే, మిగిలిన నాలుగు పాటలు కూడా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలుగా కనపడుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలు అంటే… కధలో ఈ పాటలు ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో అన్న విషయం గమనించవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే “బాహుబలి 2” ఆల్బమ్ లో సాహిత్యమే హైలైట్ గా పాటలు ఉన్నాయని చెప్పాలి. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిలు కలిసి కధకు అనుగుణంగా చర్చలు జరిపి, రాయించుకున్న పాటలుగా వినగానే స్పష్టమవుతోంది. ఈ ఆల్బమ్ లో తొలిపాట అయిన ‘సాహోరే బాహుబలి’ పాట వినగానే కట్టిపడేస్తుంది. దలేర్ మెహంది స్వరం ఈ పాటకు మరో హైలైట్. ఇక, ఫస్ట్ పార్ట్ లో మిస్సయిన బాహుబలి – దేవసేనల రొమాంటిక్ సాంగ్ ఆకలి తీర్చే విధంగా ‘హంస నావ’ అనే పాట ఉంది.
మిగతా పాటలతో పోలిస్తే… ఈ రొమాంటిక్ పాట గురించి ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏమీ లేదు గానీ, కమర్షియల్ కోణంలో ప్రభాస్ – అనుష్కల నడుమ వచ్చే పాటగా అర్ధమవుతోంది. అలాగే ‘కన్నా నిదురించారా’ అనే పాట కూడా సాహిత్యం బేస్ చేసుకుని ఉన్న పాటే తప్ప, సంగీతం పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక ‘సాహోరే బాహుబలి’ తర్వాత కధకు తగిన విధంగా ఫస్ట్ టైంలోనే వినగానే కనెక్ట్ అయ్యేది ‘దండలయ్యా’ పాట. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటగా ఈ పాటలోని సాహిత్యం చెప్పకనే చెప్తుంది. కాల భైరవ గానం ఈ పాటకు మరో హైలైట్.
ఆల్బమ్ లో చివరిదైన ‘ఒక ప్రాణం’ అనే పాట కూడా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటగా అర్ధమవుతోంది. ఈ పాట కూడా వినగానే ఆకట్టుకుంటుంది. అయితే రెగ్యులర్ గా కమర్షియల్ పాటల మాదిరి పదే పదే విని ఎంజాయ్ చేసే పాటలు కాదు గానీ, రేపు సిల్వర్ స్క్రీన్ పైన ఆ “ఏమోషన్” పండితే, ఇవే పాటలు మారుమ్రోగడం ఖాయమని చెప్పవచ్చు. ఒకటికి పదిసార్లు వినడాని కంటే కూడా విజువల్ గా చూడడానికే “బాహుబలి 2” ఆల్బమ్ నిలుస్తుందని ఫైనల్ గా చెప్పవచ్చు.



