“బాహుబలి – ది బిగినింగ్” ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రశ్న… ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అని!’ ఈ ప్రశ్నకు జవాబు సదరు చిత్ర యూనిట్ వర్గాలకు మాత్రమే తెలుసు. అత్యంత గోప్యంగా మారిన ఈ అంశంపై ఇప్పటికే ఒక్కొక్కరు ఒక్కో విశ్లేషణలు ఇచ్చి ఉన్నారు. భళ్ళాలదేవుడు ఆదేశాల మేరకే కట్టప్ప చంపాడని కొందరు, రాజమాత శివగామి ఆదేశాల మేరకు చంపాడని మరికొందరు… లేదు లేదు అసలు ‘బాహుబలి’ చావలేదు, సెకండాఫ్ లో ‘బాహుబలి’ మళ్ళీ తిరిగి వస్తాడని ఇంకొందరు… ఇలా భిన్న వాదనలు వినపడుతున్నాయి. ఎవరి ఆలోచనలు వారివి..!
అయితే ఇందులో ఏదైనా నిజం కావచ్చు, అలాగే కాకపోవచ్చు. అయితే తాజాగా మరొక కధనం కూడా సందడి చేస్తోంది. తనను చంపమని కట్టప్పను స్వయంగా అమరేంద్ర బాహుబలే ఆదేశాలు ఇస్తారని, రాజు ఆజ్ఞ మేరకే కట్టప్ప బాహుబలిని పోడిచేస్తాడని, ఇదంతా అంతర్యుద్ధంలో భాగంగా బాహుబలి పన్నిన ఎత్తుగడగా చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు హల్చల్ చేసిన అనేక కధలకు కాస్త భిన్నంగా ఈ ఆలోచన ఉండడంతో, తాజాగా ఈ కధనం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అయితే అసలు విషయం ఏమిటో ఏప్రిల్ 28వ తేదీన తేలనుంది. అప్పటివరకు ఆగలేని వారు ఇలాంటి ఊహాజనితంగా ఆలోచనలు చేసుకోవడమే!



