నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” ఆడియో వేడుక తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా అభిమానులను ఆకట్టుకునే విధంగా ప్రసంగించారు. బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమాకు మాటలు రాయడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన సాయి, గర్జించే సింహానికి మాటలు రాయడమంటే మాటలా? రగులుతున్న కాగడాకి మాటలు రాయడమంటే మాటలా? అంటూ అభిమానులను ఉద్వేగాపరిచారు.
43 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోన్న బాలకృష్ణ ఇప్పటికీ కొత్త 2000 రూపాయల నోటులా తళతళలాడుతున్నారని, ఎన్నో ఏళ్లుగా బాలకృష్ణ సినిమాలు చూస్తూ ఆనందిస్తూ వస్తున్నానని, అలాంటి బాలయ్యకు మాటలు రాయడం తన కల అని, ఈ సినిమాకి తాను రాస్తున్న మాటలు బాలయ్యకి నచ్చుతాయా? లేవా? అనుకున్నానని, తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశానని, ఈ సినిమాకి మాటలు రాసే ఓ అద్భుతమైన అవకాశం బాలకృష్ణ – క్రిష్ ల ద్వారా తనకు వచ్చిందని తన సంతోషాన్ని సభాముఖంగా వ్యక్తపరిచారు.



