వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు రారు కానీ సభలో జరిగే చర్చలపై ప్రెస్‌మీట్లు పెట్టి లేదా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ రన్నింగ్ కామెంటరీ బాగానే ఇస్తుంటారు. శాసనసభలో బాలకృష్ణ మాట్లాడిన మాటలపై కూడా ప్రస్తుతం ఇదే చేస్తున్నారు.
నాడు చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు అప్పటి సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి దీని కోసం వెళ్ళారో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అక్కడ వారికి ఎలాంటి ట్రీట్‌మెంట్ జరిగిందో చూసి చాలా బాధపడ్డారు కూడా.
బాలయ్య కూడా ఇదే అంశం గురించి మాట్లాడుతూ చిరంజీవితో ఉన్న చనువు వల్లో లేదా దశాబ్దాల తరబడి కలిసి పనిచేసిన స్నేహంతో కావచ్చు నోరు జారారు. ఆయన మాట తీరు గురించి తెలిసినవారు దీనిని అర్ధం చేసుకోగలరు.
కానీ ఇటువంటి అవకాశాలను ఎన్నడూ వదులుకోని వైసీపీ ఎప్పటిలాగే దీనిని చిలవలు పలవలు చేస్తూ చిరంజీవికి బాలకృష్ణకు, పవన్ కళ్యాణ్‌కి బాలకృష్ణకి, చిరంజీవికి పవన్ కళ్యాణ్‌కి, పవన్ కళ్యాణ్‌కి నాగబాబుకి మద్య చిచ్చు రగిలించేందుకు చాలా ప్రయాసపడుతోంది. వీరి మద్య ఏదో విదంగా చిచ్చు రగిలించగలిగితే అది కార్చిచ్చుగా మారి కూటమి ప్రభుత్వాన్ని దహించి వేస్తుందని వైసీపీ ఆశపడుతోంది పాపం!
కానీ చిరంజీవి ఎప్పటిలాగే చాలా సంయనంతో స్పందించారు. పైగా నాడు జగన్ తమని బాగానే ఆదరించారని మెచ్చుకున్నారు కూడా.
అసలు దీనిలో ఇదే మెయిన్ పాయింట్! నాడు జగన్ తమతో చాలా అవమానకరంగా వ్యవహరించినా చిరంజీవి సంయమనం కోల్పోలేదు. నేటికీ అలాగే స్పందించారు.
కానీ ఆయన స్థానంలో బాలయ్య వెళ్ళి ఉంటే తప్పకుండా వేరేలా స్పందించేవారు. అది కాస్త ఘాటుగానే ఉంటుందని అందరికీ తెలుసు. బాలయ్య చెప్పాలనుకున్నారు కానీ ఏదో చెప్పారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో నాడు తమ అధినేత జగన్ సినీ ప్రముఖులతో వ్యవహరించిన తీరుని వైసీపీ నేతలు సెన్సార్ చేసి తీసేసి, బాలయ్య డైలాగులు మాత్రం వినిపిస్తున్నారు. కానీ వారి ‘చిచ్చు’బుడ్డి వెలిగేది కొంతసేపే!




