వైసీపీ కంచుకోట అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళలోనే బీటలువారుతోందా?ఆ పార్టీకి అప్పుడే చెదలు పట్టేశాయా?అంటే అవుననే అనిపిస్తోంది ఆ పార్టీ గురించి సీనియర్ నేతలు చెపుతున్న మాటలు వింటున్నప్పుడు.
ఏ పార్టీలోనైనా అసమతి సెగలు సర్వసాధారణం. కానీ ఎన్నికలలో టికెట్ లభించలేదనో లేదా మంత్రి పదవులు దక్కడంలేదనో అసమ్మతి సెగలు వస్తే దానిని ఏదోవిదంగా ఆర్పేసుకోవచ్చు. కానీ పార్టీలో ఒకరికొకరిని పోటీగా పెట్టి, ఎవరూ బలపడకుండా అణచిపెట్టి ఉంచుకోవాలనే కుటిల రాజకీయ విదానం వైసీపీని కార్చిచ్చులా దహించి వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు తాజా నిదర్శనంగా ప్రకాశం జిల్లాలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కళ్లెదుటే ఉన్నారు.
ఆయన ఒంగోలులో తన నివాసంలో నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ “పార్టీలో కొందరు నన్ను, నా కుమారుడిని వేదిస్తున్నారు. మేము భూకబ్జాలు చేస్తున్నామని, హవాలా రాకెట్ నడిపిస్తున్నామని నేను టికెట్‌ని ఇప్పించిన ఎమ్మెల్యేల చేతే కొందరు మాపై ఆరోపణలు చేయిస్తున్నారు. నేను పార్టీ వీడుతానని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నారు. నాపై సిఎం జగన్‌కి పిర్యాదులు చేస్తున్నారు. వైఎస్సార్ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్న మాపై ఇంత నీచమైన ఆరోపణలు చేయిస్తుండటం నాకు చాలా బాధ కలిగిస్తోంది,” అంటూ కన్నీళ్ళు పెట్టుకొన్నారు.
వైసీపీలో సీనియర్ నాయకులలో బాలినేని ఒకరు. ప్రకాశం జిల్లా రాజకీయాలను ఆయన శాసిస్తుంటారు. అంత శక్తివంతుడైన నాయకుడిని ఈవిదంగా ఎవరు వేధించగలరు?బాలినేనిపై ముఖ్యమంత్రికి పిర్యాదులు చేయగల దమ్ము పార్టీలో ఎవరికుంది?బాలినేని కంటే శక్తివంతుడైన వ్యక్తి వైసీపీలో ఎవరున్నారు?అని ఆలోచిస్తే అన్ని వేళ్ళు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డివైపే చూపిస్తాయి. మొన్న కోటంరెడ్డి,మేకపాటి ఇదే చెప్పారు… నిన్న బాలినేని కూడా చూచాయగా ఇదే చెప్పారు.
వైసీపీని మీడియా, ప్రతిపక్షాల దాడుల నుంచి కాపాడటానికే సజ్జల రామకృష్ణా రెడ్డికి సలహాదారుగా నియమించుకొంటే, ఆయనే పార్టీలో సీనియర్ నేతలను దెబ్బ తీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు సిఎం జగన్ ధోరణి, విధానాలు, నిర్ణయాలతో వైసీపీ పట్ల ప్రజలలో క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంటే, మరోపక్క ఈవిదంగా పార్టీని లోలోపల నుంచి చెదపురుగులా తొలిచేసుకొని బలహీనపరుచుకొంటున్నారు.
కోటంరెడ్డి, మేకపాటి, బాలినేని… వీరందరూ కూడా వేరే పార్టీలలో నుంచి వచ్చి వైసీపీలో చేరినవారు కారు. వైఎస్సార్ హయం నుంచి ఆ కుటుంబంతో బలమైన అనుబందం ఉన్నవారు. వైఎస్సార్ మీద అభిమానంతోనే వైసీపీలో ఉన్నారు. అటువంటివారు కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వెళ్ళిపోయేలా చేస్తున్నది ఎవరు? ఎందుకు?అటువంటి శక్తివంతమైన నాయకులను బయటకు సాగనంపితే ఎవరికి నష్టం?అని ఆలోచించుకొంటే మంచిదేమో?లేకుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.



