ఆసియా కప్ లో సంచలనాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ జట్టు చరిత్ర సృష్టించే ఫలితాలను అందించి వెనుదిరగగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ వంతు వచ్చింది. కీలకమైన మ్యాచ్ లో పాకిస్తాన్ పై గెలిచి, శుక్రవారం నాడు జరిగే ఫైనల్లో టీమిండియాతో తలపడేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. పాకిస్తాన్ కు పరాభవం మిగల్చడంలో బంగ్లా సమిష్టి కృషి చేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను మరొకసారి ముశిఫికుర్ రహీం (99) పరుగులతో ఆదుకున్నాడు. రహీంకు అండగా మిథున్ 60 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ 239 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది. పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఇక లక్ష్యచేధనలో పాక్ పతనం తొలి ఓవర్ నుండే ఆరంభమైంది.
బంగ్లా మాదిరే 18 పరుగులకే తొలి 3 వికెట్లను కోల్పోయిన పాక్ ను ఓపెనర్ ఇమాం (83) పరుగులతో ఆదుకున్నాడు. కానీ మరో ఎండ్ లో కాసేపు షోయబ్ మాలిక్ (30), ఆసిఫ్ అలీ (31) మినహా ఎవరూ సహకారం అందించకపోవడంతో, ఇమాం ఒంటరి పోరాటం వృధా అయ్యింది. బౌలింగ్ లోనూ, ఫీల్డింగ్ లోనూ అత్యద్భుతమైన ఆటతీరును కనపరిచి బంగ్లాదేశ్ సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది.
ఇప్పటికే టీమిండియా ఫైనల్లోకి చేరుకోవడంతో, ఈ మ్యాచ్ లో పాక్ గెలిస్తే మరోసారి ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ను ఫైనల్లో చూడొచ్చని భావించిన అభిమానులకు నిరాశ కలిగించే వార్తే అయినా, ఈ విజయానికి బంగ్లాదేశ్ జట్టు ఖచ్చితంగా అర్హులే. ముఖ్యంగా కెప్టెన్ మొర్తజా ముందుండి బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతంగా రాణించారు. ఇదే మెరుపు ఉత్సాహంతో ఫైనల్లో టీమిండియాకు కూడా షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు.



