సినీ పరిశ్రమలో సినిమా బడ్జెట్ దేనివల్ల పెరిగిపోతోంది? లేదా సినిమా బడ్జెట్‌లో అధిక భాగం దేనికి ఖర్చవుతోంది? అనే ప్రశ్నకు ‘హీరోల పారితోషికాలకే’ అని టక్కున సమాధానం వినిపిస్తుంది. అది వాస్తవం కూడా.
తెలుగు సినీ పరిశ్రమలో రూ.100-150 కోట్లు పారితోషికాలు తీసుకునే హీరోలున్నారనే సంగతి తెలిసిందే. అదేమీ రహస్యం కాదు. హీరోల తర్వాత స్టార్ దర్శకులు, స్టార్ సంగీత దర్శకులు వగైరా కూడా గట్టిగానే పిండేసుకుంటున్నారని సోషల్ మీడియాలో కబుర్లు వినిపిస్తూనే ఉంటాయి.
పాన్ ఇండియా రేటింగ్ ఉన్న హీరోలు, దర్శకులతో సినిమా తీయడం మామూలు విషయం కానే కాదు. కనుక వంద కోట్ల బడ్జెట్ సినిమా అంటే ఇప్పుడు చిన్న సినిమా అనే అనుకోవాల్సి వస్తోంది.
అయితే అందరూ చెప్పుకుంటున్నట్లు లేదా ఊహించుకుంటున్నట్లు స్టార్ హీరోలు విలన్లు కారని ప్రముఖ నిర్మాత నాగ వంశీ చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో హీరోలని భూతద్దంలో నుంచి చూపిస్తూ వారి వల్లనే సినిమా బడ్జెట్ పెరిగిపోతోందని అందరూ వాళ్ళని నిందిస్తుంటారు.
కానీ వాస్తవం ఏమిటంటే, నిర్మాతలు తమ బడ్జెట్ ఎంతో చెప్తే దానిని బట్టే వారు పారితోషికం అడుగుతుంటారు. అది న్యాయం కూడా.
ఎందువల్లనంటే, హీరోల పేరు, పోస్టర్లతోనే టికెట్లు తెగుతాయి. సినిమా హిట్ అయ్యేందుకు వారు చాలా తీవ్రంగా శ్రమిస్తారు. అలాగే ఫ్లాప్ అయితే వారే విమర్శలు ఎదుర్కోవలసివస్తుంది. కనుక వారి పారితోషికాల వల్లనే సినిమా బడ్జెట్ పెరిగిపోయిందనే వాదనలు సరికాదని నా అభిప్రాయం,” అని అన్నారు.
కొంతకాలం క్రితం ఓ మీడియం రేంజ్ నిర్మాత ఏమన్నారంటే, “నువ్వు వంద కోట్లు పట్టుకొని నిలబడితే, నీ వెనుక మరొకడు 150 కోట్లు అతని వెనుక 200 కోట్లు పట్టుకొని నిర్మాతలు క్యూలో నిలబడి ఉంటారు.
కనుక హీరోకి అంత ఇచ్చుకోలేనని నువ్వనుకుంటే నీ వెనుక లైన్లో మరో అరడజను మంది సిద్ధంగా ఉన్నారు. లేకుంటే మళ్ళీ క్యూలైన్లో వచ్చి చేరేందుకు మరో అవకాశం కూడా లభించకపోవచ్చు. కనుక ఏదోవిధంగా తిప్పలు పడి హీరోని లాక్ చేసుకోక తప్పదు,” అని అన్నారు.
కనుక సినిమా బడ్జెట్ హీరోల వలన పెరిగిందా? లేదా వారికున్న మార్కెట్, డిమాండ్ వలన పెరిగిందా? లేదా నిర్మాతల మద్య పోటీ వలన పెరిగిందా? అంటే మూడూ అని అర్ధమవుతోంది. కనుక నాగ వంశీ చెప్పినట్లుగా బడ్జెట్ పెరిగితే హీరోలని నిందించడం సబబు కాదనిపిస్తుంది.




