ఇటీవల ‘స్పైడర్’ చిత్రం ద్వారా ధియేటర్లలో సందడి చేయడానికి ముందు ప్రిన్స్ మహేష్ బాబు పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా, ఈ సందర్బంగా మీడియా వర్గాలు “భరత్ అనే నేను” సినిమా రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించారు. అయితే వాటిని దాటవేసిన ప్రిన్స్, ఈ చిత్ర నిర్మాత డివివి దానయ్య విడుదల తేదీని మరో ఇరవై రోజుల్లో ప్రకటిస్తారని స్పష్టం చేసారు. అయితే ‘స్పైడర్’ సినిమా విడుదలై 20 రోజులు పూర్తి కావడంతో పాటు, “భరత్ అనే నేను” తాజా షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. కానీ కొరటాల వర్గం నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
సినిమా మొదలుపెట్టిన తరుణంలో జనవరి 11వ తేదీన “భరత్ అనే నేను” సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే లేటెస్ట్ గా ఈ డేట్ ఏప్రిల్ 20కి మారిందని తెలుస్తోంది. సంక్రాంతి నుండి సమ్మర్ కు షిఫ్ట్ అయిన ఈ సినిమా ‘ఫస్ట్ లుక్’ను మాత్రం సంక్రాంతి పర్వదినం కానుకగా విడుదల చేయనున్నారని సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇటీవల్ ఓ స్టిల్ లీకై సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు కనిపించనుండడంతో “భరత్ అనే నేను”పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


