భోగాపురం.. నాట్ జస్ట్ ఎయిర్ పోర్ట్!

Bhogapuram International Airport project

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాలకు నడిబొడ్డున భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్ట్ 1న ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి ఆయన పర్యటన ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది.

ఆగస్ట్ 1న ప్రారంభోత్సవం కాగానే మరుసటి రోజు నుంచే అక్కడి నుంచి విమానాల రాకపోకలు మొదలయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT

ప్రధాని మోడీ పర్యటన ఖరారు అయినందున సిఎం చంద్రబాబు నాయుడు పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, దీనిని నిర్మించి నిర్వహించబోతున్న జీఎంఆర్ సంస్థ ప్రతినిధులతో శనివారం సమావేశమై ప్రారంభోత్సవ ఏర్పాట్లు గురించి చర్చించారు. ఇక్కడ చర్చ ప్రారంభోత్సవం.. ఏర్పాట్ల గురించి కాదు.

భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో జరిగే అభివృద్ధి గురించి సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు చాలా ఆసక్తి కలిగిస్తాయి.

హైదరాబాద్‌లో శంషాబాద్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అయిన తర్వాత, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఏవిధంగా శరవేగంగా అభివృద్ధి చెందాయో, ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం చుట్టూ అదేవిధంగా అభివృద్ధి చెందుతాయన్నారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన తర్వాత ఆ చుట్టూ పక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్, హోటల్, పర్యాటకం, రవాణా తదితర రంగాలు శరవేగంగా అభివృద్ది చెందాయి. వాటితో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయి. అదే విధంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఆయా రంగాలు అభివృద్ధి చెంది, భారీగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాట అక్షరాల నిజమే కదా.

ముఖ్యంగా ఏపీలో విశాఖ నగరం ఇప్పటికే ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది. విశాఖ నుంచి భీమిలి వరకు అనేక బీచ్ పార్కులున్నాయి. బీచ్ రోడ్డులో సబ్ మెరైన్ మ్యూజియం, ఫైటర్ జెట్ మ్యూజియం, కైలాసగిరి పక్కనే తెన్నేటి పార్కు దాని వద్ద లంగరు వేసిన పెద్ద షిప్‌లో సిద్దమవుతున్న హోటల్ వంటి అనేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాలలో అనేక ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి.

ఇప్పటికే నిత్యం వేలాదిమంది పర్యాటకులు, భక్తులు ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు వీటి మద్యన నిర్మించిన భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే హోటల్, పర్యాటక రంగాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయి. సిఎం చంద్రబాబు నాయుడు ఇదే చెప్పారు! కనుక భోగాపురం.. నాట్ జస్ట్ ఎయిర్ పోర్ట్!



ADVERTISEMENT
Latest Stories