ఏపీ బిజెపికి దగ్గుబాటి పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించగానే మంత్రదండం తిప్పిన్నట్లు ఏపీ బిజెపి పరిస్థితి మారిపోదని బిజెపి అధిష్టానానికి కూడా తెలుసు. ఈ విషయం ఆమెకు కూడా బాగా తెలుసు. తెలియకపోతే ఇకపై తప్పక తెలుస్తుంది.
ఆమె బాధ్యతలు చేపట్టగానే గణాంకాలతో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆమె చెప్పిన లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో రాష్ట్రానికి అవసరమైన దానికంటే చాలా ఎక్కువే సాయం చేసింది. కానీ జగన్ ప్రభుత్వం ఆ నిధులను దుర్వినియోగం చేస్తోంది.
ఒకవేళ ఆమె బిజెపి కాక మరో పార్టీలో ఉండి ఉంటే వైసీపీ ఆమెకు అంతకంటే చాలా ఘాటుగానే జవాబిచ్చి ఉండేది. కానీ కేంద్రం దయాదాక్షిణ్యాల నెట్టుకొస్తునందున కాస్త ఆచితూచి మాట్లాడాల్సి వస్తోంది అంతే! కానీ ఆమె ఈ స్థాయిలో విమర్శిస్తుంటే జవాబు చెప్పకపోతే ఆమె ఆరోపణలన్నిటినీ అంగీకరించినట్లవుతుంది. కనుక వైసీపీ మంత్రులందరికీ వారి బాస్ ఓ లైన్ ఇచ్చిన్నట్లున్నారు. అదే… ఆమెను చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి మళ్ళీ ఆయన్నే విమర్శిస్తూ మమ అనిపించేయడం. అందరూ దానిని బాగానే ఫాలో అయిపోయారు కూడా.
కానీ ఇది చాలా పాత ఫార్ములా. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌పై దీనిని చాలా కాలంగా ప్రయోగిస్తున్నారు. కనుక ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరిని కూడా చంద్రబాబు నాయుడితో ముడిపెట్టి ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు వాటిని నమ్మరు.
కనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ చిన్న ట్వీట్‌తో మంత్రులందరికీ మరో కొత్త లైన్ ఇచ్చారు. అదేమిటంటే, “వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేకహోదా, రైల్వే జోన్ తదితర హామీల గురించి మాట్లాడితే బాగుంటుందని” పురందేశ్వరికి ట్వీట్ చేశారు.
వీటికి ఆమె ఏవిదంగా జవాబుచెప్పుకొన్నా అవి ఏపీ ప్రజలకు ఏమాత్రం ఆమోదం కాబోవు. కనుక ఇకపై వైసీపీ మంత్రులందరూ ఇదే లైన్ ఫాలో అవుతూ ఆమెను ఎదుర్కోవచ్చు.



