ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభావం.. మూడు రాష్ట్రాల్లో అధికార పీఠం కోల్పోవడం.. ఒక్కొక్కరుగా ఎన్డీయేకు దూరమవ్వడం వంటి పరిణామాలు భాజపా ఆలోచనలో పడింది. 2019లో అధికారం నిలుపుకోవడానికి ఆ పార్టీ ప్లాన్-బికి సిద్ధమైంది. ఎన్డీయేలోకి కొత్త మిత్రులను చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత రాంమాధవ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మిత్రులు దక్షిణ, ఈశాన్య భారతం నుంచి ఉంటాయని ఆయన చెప్పడం విశేషం. ఏ పార్టీలు కొత్తగా చేరుతాయనేది మాత్రం చెప్పలేదు
[m9ad]
తమిళనాడులో ఏఐడీఎంకేతో పొత్తు దాదాపుగా కంఫర్మ్ అన్నట్టే తెలుస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమిని విచ్ఛిన్నం చేసి బీజేపీ జేడీఎస్ తో జత కట్టబోతుంది అనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏమైనా పొత్తులు ఉండబోతున్నాయా అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఈ ఏడాది మార్చిలో తెదేపా ఎన్డీయే నుంచి బయటకొచ్చింది. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఎన్నికల అంశం అయిపోయింది.
ఈ క్రమంలో వైకాపా, జనసేన పార్టీలు బీజేపీకి కొంత అనుకూలంగా కనిపిస్తున్నా… ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసే ధైర్యం ఆ పార్టీలు చేస్తాయా అనేది అనుమానమే. మరోవైపు తెలంగాణాలో ఇటీవలే ఆ పార్టీ ఘోరమైన ఫలితాలు చవిచూసింది. తెరాసతో పొత్తు కోసం ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తుండగా ముస్లిం ఓట్లు పోతాయని కారు పార్టీ సుముఖంగా లేదు. కేసీఆర్ తెలివిగా ఢిల్లీలో బీజేపీకి అనుకూలంగా ఉంటూ హైదరాబాద్ లో మాత్రం మోడీని తిడుతూ ముందుకు పోతున్నారు.
ఈ క్రమంలో ముందస్తు పొత్తులు ఎంత వరకు పనికి వస్తాయి అనేది అనుమానమే. ఈ పక్షాలు ఎన్నికల తరువాత అవసరమైతే తమ కోసం పని చేస్తాయని బీజేపీ భావిస్తుంది. అయితే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి సహకరిస్తున్న వర్గాలు ఎన్నికల తరువాత ఏం చేస్తాయనేది చెప్పలేం. అప్పుడు రాజెవరో.. రెడ్డెవరో? ఎన్డీయే, యూపీయేలకు దగ్గరగా సీట్లు వస్తే కాంగ్రెస్ వైపుకు వెళ్లినా ఆశ్చర్యం కలగదు. కాబట్టి బీజేపీ వీలైనన్ని ఎన్నికల ముందు పొత్తులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది.



