హిందుత్వకు పేటెంట్ ఏ పార్టీకి ఉంది?అంటే ఎవరైనా టక్కున బిజెపికి అని అంటారు. హిందుత్వ అజెండాగా బిజెపి ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి మాత్రం దానిని వదిలేసి టిడిపి, వైసీపీల మీద విమర్శలు చేస్తూ కాలక్షేపం చేసేస్తోంది. బహుశః ఏపీలో హిందుత్వ అజెండాతో ముందుకు సాగలేమని భావిస్తుండటమే కారణమై ఉండవచ్చు.
కారణాలు ఏవైనప్పటికీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న అనేక హిందుత్వ అస్త్రాలను ఏపీ బిజెపి నేతలు మూటకట్టి జమ్మిచెట్టుపై దాస్తున్నట్లున్నారు. ఏపీ బిజెపి నేతలు వాటిని వాడుకోకపోవడంతో టిడిపి యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ వాటిని చెట్టుపై నుంచి దింపి వాడేసుకొంటున్నారు!
ఇటీవల నారా లోకేష్ వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తునప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలు, విగ్రహాలపై జరిగిన దాడులు, ఆలయాలలో జరుగుతున్న దొంగతనాలు, ఆలయాల సొమ్ముని వైసీపీ కాజేస్తుండటం వంటి అంశాల గురించి మాట్లాడారు. విజయనగరం జిల్లాలో రామతీర్ధాల సంఘటన, అంతర్వేది స్వామివారి రధం దగ్ధం ఘటన, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారి రధంపైనా అమర్చిన వెండి సింహం బొమ్మల దొంగతనాల గురించి ప్రస్తావిస్తూ జగన్ పాలనని తప్పు పట్టారు.
అదేవిదంగా ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలోని హిందూ దేవాలయాలు, విగ్రహాలపై దాడులు, అంతర్వేది, బెజవాడ కనకదుర్గమ్మ, తిరుమల ఆలయాలలో జరిగిన సంఘటనల గురించి ప్రస్తావిస్తూ, జగన్ పాలనలో దేవుళ్ళకి కూడా రక్షణ లేకుండాపోయిందని, ప్రజలని, సహజవనరులనే కాక దేవుళ్ళని కూడా జగన్ ప్రభుత్వం దోచుకొంటోందని విమర్శించారు.
నారా లోకేష్, పవన్ కళ్యాణ్ బహుశః సందర్భాన్ని బట్టి ఈవిదంగా మాట్లాడి ఉండవచ్చు. కానీ ఇటువంటి అంశాలపై బిజెపి మాట్లాడితే కనిపించే ప్రభావం, ఏర్పడే ఒత్తిడి వారు మాట్లాడితే అంతగా ఉండదని వేరే చెప్పక్కరలేదు. కానీ ఏపీ బిజెపి చేతులను ఢిల్లీ పెద్దలు కట్టేయడంతో వారు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు మెదపలేకపోతున్నారని భావించాల్సి ఉంటుంది. అయితే బిజెపికి ఆత్మ వంటి హిందుత్వను వదిలేసుకొంటే, ఇక దానిని ఎవరు పట్టించుకొంటారు?అని ఆలోచించిన్నట్లు లేదు.



