కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలలో బలముంది కానీ బీజేపీకి లేకపోవడంతో ఆ పార్టీ ఉత్తరాది రాష్ట్రాలనే ఎక్కువగా నమ్ముకుంటోంది. దక్షిణాది కంటే ఉత్తరాది రాష్ట్రాలలోనే లోక్‌సభ సీట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. కనుక బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తరాది రాష్ట్రాలలో సీట్లు గెలుచుకోవడం తప్పనిసరి.
అందుకే కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాలలో ముఖ్యంగా మోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిపెట్టింది.
ఉత్తరాదిలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. మహారాష్ట్ర-48, పశ్చిమబెంగాల్-42, బిహార్-40, మధ్యప్రదేశ్- 29, గుజరాత్-26, రాజస్థాన్-25, ఛత్తీస్‌ఘడ్-11, ఉత్తరాఖండ్-5 ఎంపీ సీట్లు ఉన్నాయి.
కనుక ఈ 9 రాష్ట్రాలలో కలిపి 306 ఎంపీ సీట్లు ఉన్నాయి. కనుక ఈ రాష్ట్రాలలో ఆధిక్యత సాధించగలిగితే కేంద్రంలో అధికారంలోకి రావచ్చు.
వీటిలో పశ్చిమ బెంగాల్ (మమతా బెనర్జీ), బిహార్ (నితీష్ కుమార్), ఢిల్లీ (అర్వింద్ కేజ్రీవాల్) బీజేపీకి స్పీడు బ్రేకర్లుగా ఉన్నారు. మిగిలిన రాష్ట్రాలలో బీజేపీకి పూర్తి పట్టు ఉంది.
కనుక ఉత్తరాదిలో అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రాలపైనే బీజేపీ ఎక్కువ దృష్టి పెడుతోంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలో ముఖ్యంగా యూపీ, బిహార్, రాజస్థాన్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో హిందుత్వ సెంటిమెంట్ చాలా ఎక్కువ.
కనుక అక్కడ కేంద్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసి యూపీలోని బెనారస్ నగరాన్ని, కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేసింది.
అలాగే యావత్ దేశ ప్రజల సెంటిమెంట్‌గా మారిన అయోధ్య రామ మందిరాన్ని కూడా నిర్మించి ఈ నెల 16-22 మద్య ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ రెండూ కూడా బీజేపీకి హిందూ ఓట్లు రాల్చేవే అని వేరే చెప్పక్కరలేదు.
గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవాలో ఎంపీ సీట్లను కొల్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గత 5 ఏళ్లుగా గుజరాత్, మహారాష్ట్రలలో అనేక భారీ ప్రాజెక్టులు చేపడుతోంది.
ఏపీ రాజధాని అమరావతికి నిధులు ఇచ్చేందుకు తటపటాయించిన కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలో లక్షల కోట్లు ఖర్చు చేసి అంతర్జాతీయ స్థాయిలో ధొలేరా అనే ఓ కొత్త నగరాన్నే నిర్మిస్తోంది.
సుమారు రూ.30,000 కోట్ల వ్యయంతో గుజరాత్-మహారాష్ట్రలను కలుపుతూ దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో సముద్రంపై అతిపెద్ద వంతెన ‘అటల్ సేతు’ (ముంబయి-నవీ ముంబయి) సుమారు రూ.20,000 కోట్లు వ్యయంతో నిర్మించింది. దీనిని జనవరి 12న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
ఇంకా ఢిల్లీ-ముంబయి-రాజస్థాన్-గుజరాత్ రాష్ట్రాలను కలుపుతూ అతిపెద్ద హైవే కారిడార్ నిర్మాణం జరుగుతోంది. అలాగే దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోని ఈశాన్య రాష్ట్రాలలో కూడా మోడీ ప్రభుత్వం అనేకానేక అభివృద్ధి పనులు చేపడుతోంది.
వీటితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో చెప్పుకోదగ్గ అటువంటి ఒక్క భారీ ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదు కానీ ప్రాంతీయ పార్టీలను గుప్పెట్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తూ పెత్తనం చలాయిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల పట్ల ఈ వివక్ష కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేవిదంగా వ్యవహరించింది.




