తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ, జనసేనల మద్య సీట్ల సర్దుబాట్లయ్యాయి. మొదట ఒంటరిగా 32 స్థానాలలో పోటీ చేయాలనుకొన్న జనసేన, ఇప్పుడు కేవలం 9 సీట్లతోనే సర్దుకుపోతోంది.
ట్విట్టర్‌లో జనసేన ఓ లేఖ పోస్ట్ చేసింది. ఇదివరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బీజేపీ గెలుపు కోసం జనసేన ఎంతో సహకరించిందని, మళ్ళీ ఇప్పుడూ మోడీ ప్రధాని అయ్యేందుకు సహకరించబోతోందని దాని సారాంశం.
2014 ఎన్నికలప్పుడు అటు జాతీయస్థాయిలో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జనసేన పోటీ చేయకుండా వెనక్కు తగ్గి టిడిపి, బీజేపీలకు మద్దతు ఇచ్చింది. అప్పటికి జనసేన ఇంకా నిలద్రొక్కుకోలేదు కనుక పవన్ కళ్యాణ్ సరైన నిర్ణయమే తీసుకొన్నారని భావించవచ్చు.
2019 ఎన్నికల నాటికి పార్టీ నిలద్రొక్కుకొంది కనుక ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఓడిపోయింది. అది వేరే విషయం. కానీ ఆ ఓటమి నుంచి తాము అనేక పాఠాలు నేర్చుకొన్నామని పవన్ కళ్యాణ్ చెపుతుండేవారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా శ్రమించి ఏపీ, తెలంగాణలలో జనసేనను బలోపేతం చేసుకొన్నారు.
అందుకే ఈసారి తెలంగాణలో 32 స్థానాలలో పోటీకి సిద్దపడ్డారు. అందుకే ఈసారి అవకాశం వస్తే ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్దమని పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తున్నారు.
పదేళ్ళపాటు రెండు రాష్ట్రాలలో పార్టీని, అభ్యర్ధులను సిద్దం చేసుకొని, తీరా ఎన్నికలొచ్చేసరికి ఇలా ఏదో ఓ కారణంతో జనసేన పోటీ చేయకుండా వెనక్కు తగ్గడం ‘రాజకీయంగా ఆత్మహత్య’ చేసుకోవడమే చెప్పాలి. వైఎస్ షర్మిల కూడా ఎంతో శ్రమించి చివరికి తన పార్టీని చేజెతులా చంపేసుకోవడం అందరూ చూశారు. పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించు అదే చేస్తున్నారు కదా?
ఈ ఎన్నికలలో పోటీకి సిద్దపడిన జనసేన నేతలకి పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో వారు తీవ్ర నిరాశ చెందడమే కాకుండా వారికి తమ అధినేతపై నమ్మకం కూడా పోతుంది. అంతేకాదు… ఇటువంటి వైఖరి వలన ప్రజలకు, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్‌పై నమ్ముతున్న కొన్ని సామాజికవర్గాలకు కూడా ఆయనపై నమ్మకం పోతుంది కదా?
తెలంగాణలో బీజేపీ కోసం త్యాగం చేసిన పవన్ కళ్యాణ్, ఆంద్రాలో టిడిపి కోసం త్యాగం చేయకుండా ఉంటారా?అని ఏపీలోని జనసేన అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు.
మోడీ మళ్ళీ ప్రధాని అయ్యేందుకు బీజేపీకి సహకరిస్తున్నామని జనసేన చెప్పుకొంది. మరి పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యేందుకు బీజేపీ సహకరిస్తుందా?కనీసం చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో ఆయన మాటను మోడీ, అమిత్ షాలు గౌరవించారా?మరి బీజేపీ, మోడీ ప్రధాని అయ్యేందుకు జనసేన త్యాగాలు చేయాల్సిన అవసరం ఏమిటి?
ఇలా ప్రతీ ఎన్నికలలో ఏదో ఓ కారణంతో త్యాగాలు చేసుకొంటూపోతే, జనసేనను ప్రజలే కాదు… పార్టీలో నేతలైనా నమ్ముతారా?అనే ప్రశ్నకు పవన్ కళ్యాణే సమాధానం చెప్పాలి.




