మొన్నటివరకు నందమూరి కాంపౌండ్ వేదికగా వరుసగా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలతో సినిమాలకు దర్శకత్వం వహించిన బోయపాటి ‘యు టర్న్’ తీసుకున్నట్లున్నారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కొట్టిన “సరైనోడు”తో మెగా కాంపౌండ్ లెక్కలు మారినట్లుగా కనపడుతోంది. బన్నీ కెరీర్ లో నెంబర్ 1 సినిమాగా అవతరించిన ‘సరైనోడు’ తర్వాత ఇతర మెగా హీరోలైన రామ్ చరణ్, చిరంజీవిలతో బోయపాటి రెండు సినిమాలను చేయబోతున్నారన్న వార్తలు వచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు.
అయితే అందులో ఒకటి మాత్రం ఖరారైందన్న విషయాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అధికారికంగా ప్రకటించారు. ‘సాక్షి ఎక్సలెన్స్’ అవార్డుల వేడుకకు హాజరైన సందర్భంలో బోయపాటి శ్రీను గురించి వ్యాఖ్యానించిన అల్లు అరవింద్, ఈ విషయాన్ని ఖరారు చేసారు. ఇండస్ట్రీకి బోయపాటి టాలెంటెడ్ దర్శకుల అవసరం ఉందని, మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఓ మంచి స్క్రిప్ట్ ను బోయపాటి రచిస్తున్నారని చెప్పడంతో, సురేందర్ రెడ్డి తదుపరి అవకాశం బోయపాటికే దక్కిందని స్పష్టమైంది.
‘సరైనోడు’ సినిమాకు ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డు అందుకున్న బోయపాటికి చిరంజీవి 152వ సినిమా అవకాశం దక్కిదంటే, మరోసారి పూరీకి మెగాస్టార్ హ్యాండ్ ఇచ్చినట్లే భావించవచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా మెగా సినిమాను ప్రస్తావిస్తూ… తప్పకుండ చిరుతో సినిమా ఉంటుందని పూరీ ఆశాభావం వ్యక్తం చేసారు. అయితే అరవింద్ తాజా ప్రకటనతో పూరీకి భంగపాటు తప్పేలా లేదు. ఇక, వరుసగా రెండు సొంత సినిమాలకు ఓకే చెప్పిన మెగాస్టార్, మూడవ సినిమా కూడా అల్లు అరవింద్ చేతికే వెళ్లబోతుందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.



