దేవుడు దర్శనం చేసుకోవాలంటే పూజారి కరుణించాల్సిందే కదా! అదేమో తెలియదు గానీ… చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశం రావాలంటే ముందుగా రామ్ చరణ్ తో ఓ సినిమా చేసి డైరెక్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే అన్న చందంగా ప్రస్తుతం మెగా కాంపౌండ్ కొనసాగుతోందన్నది ట్రేడ్ టాక్. అవును… రామ్ చరణ్ తో ‘ధృవ’ సినిమా చేసిన తర్వాతనే సురేందర్ రెడ్డికి “సైరా నరసింహారెడ్డి” సినిమాను మెగాస్టార్ అందించిన విషయం తెలిసిందే.
ఒక్క సురేందర్ రెడ్డి విషయంలోనే కాదు, ప్రస్తుతం బోయపాటి సందర్భంలోనూ ఇదే కొనసాగుతోందన్నది లేటెస్ట్ న్యూస్. మెగాస్టార్ చేయబోయే 152వ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారన్నది ఓల్డ్ న్యూస్. స్వయంగా చిరునే ఈ విషయాన్ని వెల్లడించారు కూడా! కానీ, అంతకంటే ముందు రామ్ చరణ్ తో బోయపాటి శ్రీను ఓ సినిమాను చేయబోతున్నాడు అనేది లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న “రంగస్థలం” పూర్తయిన తర్వాత బోయపాటితో జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది.
జనవరి నాటికి ‘రంగస్థలం’ షూటింగ్ పూర్తి కానున్న నేపధ్యంలో… ఫిబ్రవరి నుండి బోయపాటి – రామ్ చరణ్ కాంబో తెరపైకి వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ సినిమాను నిర్మిస్తున్న డివివి దానయ్య, ఈ సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారట. మెగా హీరో అల్లు అర్జున్ కు “సరైనోడు” వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి, మరి రామ్ చరణ్ కు ఎలాంటి అనుభూతులను మిగులుస్తారో చూడాలి. దీనిపైన త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.


