మీ జాబితాల కోసం వెయింటింగ్ ఇక్కడ!

BRS BJP Congress

తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు ప్రస్తుతం ప్రత్యర్ధుల జాబితాల కోసం ఎదురుచూస్తున్నాయి. బిఆర్ఎస్ పార్టీ 119 స్థానాలకు 115 మంది అభ్యర్ధులతో చాలా రోజుల క్రితమే జాబితా ప్రకటించేసింది. దాంతో టికెట్‌ దొరకని నేతలు కాంగ్రెస్‌ పార్టీకి క్యూ కడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ 55 స్థానాలకే అభ్యర్ధులను ప్రకటించి, మిగిలిన స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించకుండా కూర్చొంది. బహుశః బయట పార్టీల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉన్నారేమోనని ఎదురుచూస్తున్నట్లుంది.

ADVERTISEMENT

బీజేపీ కూడా ఇంతవరకు అభ్యర్ధులను ప్రకటించకుండా కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూస్తోంది. కానీ అందరూ కాంగ్రెస్‌ పార్టీకే క్యూ కడుతుండటంతో నేడో రేపో తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్దమవుతోంది.

ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ నిర్వహించిన సమావేశానికి 115 మంది అభ్యర్ధులను ఆహ్వానించారు కానీ అందరికీ బీ-ఫామ్స్ ఇవ్వలేదు. వారిలో 59 మందికి మాత్రమే బీ-ఫామ్స్ ఇవ్వడంతో మిగిలినవారిలో ఆందోళన మొదలైంది. అది గమనించి మరో 50 మందికి బీ-ఫామ్స్ ఇచ్చారు.

మిగిలిన 10 మందికి నేటికీ బీ-ఫామ్స్ ఇవ్వలేదు. అంటే ఆ 10 స్థానాలలో అభ్యర్ధులను మార్చే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు అర్దమవుతోంది. కాంగ్రెస్‌, బీజేపీలు తమ జాబితాలు ప్రకటిస్తే, ఆ రెండు పార్టీలలో టికెట్‌ దొరకని బలమైన అభ్యర్ధులు బిఆర్ఎస్‌లోకి వస్తే తీసుకొని వారికి ఆ 10 స్థానాలు ఇవ్వాలని కేసీఆర్‌ అనుకొంటుండవచ్చు.

కాంగ్రెస్‌, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీ మూడు కూడా ఎదుట పార్టీలో నేతల కోసం ఎదురుచూస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్‌, బీజేపీ, బిఆర్ఎస్ మూడు పార్టీల నేతలు మీ పార్టీలు అవినీతిమయం అని, అసమర్ధ ప్రభుత్వాలని, కుటుంబ పార్టీలని పరస్పరం విమర్శించుకొంటూ ఉంటాయి. కానీ ఆ పార్టీల నుంచే నేతలను, అభ్యర్ధులను తెచ్చుకొని ప్రజల ముందు నిలబెడుతున్నాయి. అప్పుడు ప్రజలు కూడా ఈ మూడు పార్టీలలో ఏదో ఓ పార్టీని తాము ఎన్నుకొంటున్నామని గట్టిగా నమ్ముతున్నప్పటికీ, జెండాలు మార్చుకొని వస్తున్న ఆ మూడు పార్టీల నేతలకే ఓట్లు వేసి గెలిపించుకోబోతున్నారని భావించకపోవడం ఆ మూడు పార్టీల, నేతల అదృష్టం అనుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories