టీఎస్ ఆర్టీసీ: ఎవరి స్టోరీ వారిదే!

BRS, Congress Clash Over Hyderabad RTC Fare Hike

హైదరాబాద్‌లో సిటీ బస్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ నేడు బీఆర్ఎస్‌ పార్టీ ‘ఛలో బస్ భవన్‌’కి పిలుపునిచ్చింది. అది ఎలా సాగుతోందో అందరూ ఊహించుకోగలరు. కానీ ఆర్టీసీ పేరుతో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు చాలా ఆసక్తికరంగా ఉంది.

“కాంగ్రెస్‌ ప్రభుత్వం మహాలక్ష్మి పధకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, ఎప్పటికప్పుడు ఏదో సాకుతో ఛార్జీలు పెంచేస్తూనే ఉంది. ఇది ప్రజలను మోసం చేయడమే.

ADVERTISEMENT

మహాలక్ష్మి పధకం క్రెడిట్ తీసుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, నెలనెలా ఆ సొమ్ముని ఆర్టీసీకి చెల్లించడం లేదు. అందువల్ల ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్‌సీ (వేతన సవరణ) చెల్లించడం లేదు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీని ఆదుకోవడానికి కేసీఆర్‌ ఎంతగానో కృషి చేశారు. ఆర్టీసీకి రూ.1500 కోట్లు విడుదల చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్‌ బస్సులు ప్రవేశపెడుతూ మెల్లమెల్లగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తోంది. విద్యుత్‌ బస్సులు వస్తే ఈ ఆర్టీసీ కార్మికులందరినీ ఇతర జిల్లాలకు బదిలీ చేసేస్తారు. అప్పుడు వీరి కుటుంబాల పరిస్థితి ఏమిటి?” అని హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు.

దీనికి కాంగ్రెస్‌ మంత్రులు కూడా అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. “నాడు కేసీఆర్‌ హయంలో ఆర్టీసీ కార్మికులు జీతాలు పెంచాలని కోరుతూ 55 రోజులు సమ్మె చేశారు. ఆ సమయంలో ఆర్ధిక సమస్యలు, ఆందోళనతో అనేకమంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. అయినా కేసీఆర్‌ కనికరించలేదు!

పైగా సమ్మె కొనసాగిస్తే ఆర్టీసీని మూసివేస్తామని, అప్పుడు అందరూ రోడ్లపై ముష్టెత్తుకుంటారని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. చివరికి ఆర్టీసీ ఉద్యోగులు కాళ్ళపై పడి క్షమాపణ చెప్పుకునేలా చేశారు.

ఆర్టీసీ కార్మికులు దాచుకున్న సొమ్ముని కూడా నాడు తీసి వాడేసున్నారు. కనీసం ఆ బకాయిలు చెల్లించాలని కోరినా కేసీఆర్‌ కనికరించలేదు.

సమ్మె తర్వాత యూనియన్లను లేకుండా చేసి కార్మికులను నిస్సహయులుగా చేసి వారితో ఆడుకున్నారు. ఆర్టీసీకి చెందిన ఆస్తులను బీఆర్ఎస్‌ పార్టీ నేతలు లీజు పేరుతో సొంతం చేసుకున్నారు.

ఇలా ఒకటా రెండా… టీజీఎస్ ఆర్టీసీని, కార్మికులను దెబ్బ తీయడానికి కేసీఆర్‌ చేయని పని లేదు. సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల ఉసురు తగలడం వల్లనే ఎన్నికలలో కేసీఆర్‌ ఓడిపోయారు.

కానీ మా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టింది. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తోంది. పాత డొక్కు బస్సుల స్థానంలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టింది. ఆర్టీసీ ఉద్యోగులకు టంచనుగా నెలనెలా జీతాలు చెల్లిస్తోంది, ” అంటూ తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధీటుగా సమాధానం ఇచ్చారు.

కనుక కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలలో టీజీఎస్ ఆర్టీసీకి, ఉద్యోగులకు ఏది మేలు చేసిందో ఎవరికి వారు ఆలోచించుకోవలసిందే!

ADVERTISEMENT
Latest Stories