లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుమార్తె పాత్ర అంటూ గడిచిన ఏడాదిగా మీడియాలో వార్తలు చెక్కర్లుకొట్టడం…ఆ తరువాత సద్దుమణిగిపోవడం రాజకీయ ప్రక్రియలో భాగంగా నడిచిపోతూ వస్తున్నాయి.
అయితే ఇప్పుడా పరిస్థితులు లేవు. రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పాటుగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ పెద్దల అవినీతిని, తప్పిదాలను ఒక్కక్కొటిగా ప్రజలముందు ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటు పవర్ తో పాటుగా పరువు పోగుట్టుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
ఒక పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ ఊపిరిసలపనీయకుండా మేడి గడ్డ, కాళేశ్వరం, అన్నారం అంటూ నీటి ప్రోజెక్టుల పేరుతో జరిగిన అవకతవలను బయటపెడుతుంటే, మరో పక్క ఎప్పటి నుంచో బిఆర్ఎస్ కు చెవిలో జ్యూరీగలా విసిగిస్తున్న కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కూడా ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకు రావడంతో ఈ కేసు బిఆర్ఎస్ కొంపముంచనుందా అనే అనుమనాలు మొదలయ్యాయి.
ఈ స్కాం లో కవిత పై వచ్చిన ఆరోపణలకు గాను సిబిఐ కవితను పలుమార్లు విచారించారు. అయితే ఇప్పుడు తాజాగా కవితను నిందితురాలుగా చేర్చి అటు కేసీఆర్ కు ఇటు కవితకు సిబిఐ తరహా కిక్ చూపించారు అధికారులు. ఈ నెల 26 న ఢిల్లీ లో జరిగే విచారణకు హాజరుకావాలంటూ 41 ఏ కింద కవితకు నోటీసులు జారీచేశారు.
గతంలో ఈ కేసు విచారణలో సాక్షిగా ఉన్న కవిత ఇప్పుడు నిందితురాలుగా మారడంతో లిక్కర్ కేసుతో కవిత రాజకీయ జీవితం మలుపు తిరగనుందా..? అంటూ బిఆర్ఎస్ పార్టీలోనే గుసగుసలు మొదలయాయ్యి. సిబిఐ ఇచ్చిన నోటీసు ప్రకారంగా కవిత విచారణను ఎదుర్కుంటారా..? లేక కోర్ట్ ను ఆశ్రయిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఊహించని విధంగా అధికారం చేజారడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి కవిత లిక్కర్ కేసు మరో తలనొప్పి కావడం ఖాయంగా కనపడుతుంది. ఇన్నాళ్ళుగా అధికారం అనే కవచం అండతో ఈ కేసులను నెట్టుకొస్తున్న కవితకు ఇక పనిష్మెంట్ తప్పేలా లేవు.
దానితో పాటుగా మరి కొన్ని రోజులలో తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అధికార పార్టీ కాంగ్రెస్ కు బిఆర్ఎస్ ని ఇరుకునపెట్టడానికి ఈ కేసు చేచేతుల ఆయుధాలు అందించినట్టే. అధికారం చేజారడంతో తత్త్వం బాధపడిన కేసీఆర్ బీజేపీతో దోస్తీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు అనే వార్తలు ఊపందుకున్న ఈ తరుణంలో కవిత లిక్కర్ కేసు ముందుకు కదలడం కేసీఆర్ కు బిఆర్ఎస్ కు అనుకోని మరో షాక్ అనే చెప్పాలి.




