ఆ మూడే కాంగ్రెస్‌ కొంప ముంచనున్నాయా?

Telangana Congress

తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనుకొన్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి బీజేపీని వెనక్కు నెట్టి బిఆర్ఎస్ పార్టీని ఢీ అంటే ఢీ అని ఢీకొంటోంది. కానీ కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేసిన కేసీఆరే, మళ్ళీ దానిని జాకీలు పెట్టి పైకిలేపారని, ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలందరూ బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఈ వాదనలను పూర్తిగా కొట్టిపారేయలేము. కానీ కాంగ్రెస్‌ అకస్మాత్తుగా బలం పుంజుకోవడానికి కారణాలు ఏవైనప్పటికీ, ఇప్పుడు కేసీఆర్‌కు గట్టి పోటీనిస్తున్నది అదే.

ఓ పక్క కాంగ్రెస్‌కు విజయావకాశాలు కనిపిస్తుంటే, మరోపక్క కర్ణాటక ఎన్నికలలో ఇచ్చిన 5 గ్యారెంటీ హామీలను అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేయలేకపోతుండటం, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే విద్యుత్ కొరత, కోతలు పెరిగిపోవడం ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్‌కు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. దానికి తోడు మరెవరూ లేన్నట్లు కర్ణాటక సిఎం సిద్దరామయ్య, డెప్యూటీ సిఎం డికె శివకుమార్‌లను కూడా ఎన్నికల ప్రచారానికి తెచ్చుకొని వారు మాట్లాడే మాటలతో మరింత ఇబ్బంది పడుతున్నారు.

ADVERTISEMENT

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతీ ఆరు నెలలకి ముఖ్యమంత్రులు మారుతూనే ఉంటారని బిఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కర్ణాటకలో ఇప్పుడు అదే జరుగుతోంది. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా చేపట్టి ఇంకా మూడు నెలలు కాలేదు. అప్పుడు ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలు, మంత్రులు ముఖ్యమంత్రి పదవి కోసం పైరవీలు ప్రారంభించారు. ఇక తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కూడా ఎవరికి వారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకొంటున్నారు. అంటే తెలంగాణ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాటలు తప్పవని ముందే స్పష్టం అవుతోందన్న మాట!

అయినా కాంగ్రెస్‌ నేతలు ఎవరూ నోరు కట్టడి చేసుకోవడం లేదు. కనుక తెలంగాణ ఎన్నికలలో ఈ మూడు అంశాలే కాంగ్రెస్‌ కొంప ముంచేలా ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories