బిఆర్ఎస్ పార్టీ 6 వికెట్స్… నాట్ అవుట్!

kcr-brs-23-years

అత్యంత శక్తివంతమైన ఓ రాజకీయ పార్టీ ఒక ఎన్నికలలో ఓడిపోతే ఇంత త్వరగా కుప్పకూలిపోతుందా? అనిపిస్తుంది తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీని చూస్తే. శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

ADVERTISEMENT

ఈ నాలుగైదు రోజులలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిపోగా నేడో రేపో మరో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందే ఇద్దరు బిఆర్ఎస్ ఎంపీలు, మరో ముగ్గురు మాజీ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. లోక్‌సభ ఎన్నికలలో వారినే అభ్యర్ధులుగా నిలబెట్టడంతో వారిప్పుడు బీజేపీ ఎంపీలయ్యారు. కాంగ్రెస్‌, బీజేపీలు చెరో 8 ఎంపీ సీట్లు గెలుచుకోగా, మజ్లీస్‌ మిగిలిన ఒక సీటుని గెలుచుకోవడంతో ఇప్పుడు కేసీఆర్‌ వద్ద ఒక్క లోక్‌సభ ఎంపీ కూడా లేరు.

కేసీఆర్‌తో కలిపి బిఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ఆరుగురు చేజారిపోతే ఇక 33 మందే మిగులుతారు. వారిలో మరో 15-20 మంది తమతో టచ్చులో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి లోక్‌సభ ఎన్నికలకు ముందే చెప్పారు.

అదే కనుక జరిగితే, బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు మాత్రమే మిగులుతారు కనుక అప్పుడు మళ్ళీ బిఆర్ఎస్ పేరుని కేసీఆర్‌ పార్టీగా మార్చుకోవాలేమో?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాజకీయాలను, దేశ రాజకీయాలను శాశించగలనని అనుకున్న కేసీఆర్‌, ఒక్క ఓటమితో ఇంత దయనీయ స్థితికి ఎందుకు చేరుకోవడం ఆశ్చర్యమే. ఆయ్న తన రాజకీయ ఎదుగుదలకు తప్పుడు మార్గాలు ఎంచుకున్నందునే నేడు ఈ దుస్థితి కలిగిందని చెప్పవచ్చు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకుని నిర్వీర్యం చేయాలనుకున్నారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ‘ఫిరాయింపుల సంస్కృతి’ని కేసీఆర్‌ ప్రారంభిస్తే, ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని కొనసాగిస్తూ బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేస్తోంది.

ఆనాడు టిడిపి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఫిరాయింపజేసుకోవడం కేసీఆర్‌ గొప్పగా అనుకున్నారు తప్ప తప్పు అనుకోలేదు.

కానీ ఇప్పుడు ఒక్కో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరిపోతుంటే తప్పుగా కనిపిస్తోంది. తన అనుచరులను పంపించి వారి ఇళ్ళ ముందు ధర్నాలు చేయిస్తున్నారు!. కానీ ఫిరాయింపులు… నువ్వు నేర్పించిన విద్యే కదా? అని బయటకు వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. కనుక కేసీఆర్‌ తాను కనిపెట్టిన ఫిరాయింపు రాజకీయ ఫార్ములాకి ఇప్పుడు తానే బలైపోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories