తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం సంచలనం అనుకుంటే, అంతటి రాజకీయ మేధావిని ఓడించి ఫామ్ హౌస్‌లో కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి ప్రతిష్ట ఏడాదిలోనే మసకబారడం కూడా విశేషమే.
ఓ పెద్ద హీరో పాన్ ఇండియా సినిమాపై ఏవిదంగా భారీ అంచనాలు ఉంటాయో ఆదేవిదంగా రేవంత్ రెడ్డిపై కూడా చాలా బారీ అంచనాలతోనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. కానీ కేవలం ఏడాదిలోగానే పాలన, అభివృద్ధి విషయంలో చేతులు ఎత్తేసిననట్లే కనిపిస్తున్నారు.
Also Read – ఈవీఎంలా.. వాస్తు దోషాలా.. ఏవి దెబ్బేశాయబ్బా?
ఇందుకు తాజా నిదర్శనంగా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ పెద్ద జాబితా పెట్టింది. ఈ ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, హాస్టల్స్‌లో కలుషిత ఆహారం తిని మృతి చెందినవారు, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 48 అంటూ.. వారి పేర్లు, ఊరు, చదివిన పాఠశాలల వివరాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కుమురం భీమ్ జిల్లాలో వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అక్టోబర్ 30న కలుషిత ఆహారం తిని 68 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురికాగా, వారిలో శైలజ (16) అనే బాలిక హైదరాబాద్, నీమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నేడు (మంగళవారం) చనిపోయింది.
Also Read – కేసీఆర్ చరిత్రని రేవంత్ తుడిచేయగలరా?
ఓ పక్క విద్యార్ధులు పిట్టల్లా రాలిపోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా, ఏడాది పాలన పూర్తయిందంటూ డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుండటాన్ని బిఆర్ఎస్ పార్టీ తప్పు పడుతూ సోషల్ మీడియాలో ఆక్షేపించింది.
ప్రభుత్వ, గురుకుల పాఠశాలలో విద్యార్ధులకు సరైన సౌకర్యాలు లేవు.. స్కూలు భవనాలకు మరమత్తులు చేయడం లేదంటే అర్దం చేసుకోవచ్చు. కానీ విద్యార్ధులకు ప్రతీరోజూ ఎప్పటికప్పుడు వండి వడ్డించే ఆహారం తిని అస్వస్థతకు గురవుతుండటం, చనిపోతుండటం చాలా దిగ్బ్రాంతి కలిగించే విషయమే కదా?
Also Read – మంచులో కొట్లాటలు.. తీర్పులు అవసరమా?
ఉపాధ్యాయుల మొదలు డీఈవో, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ వరకు వేలాదిమంది పనిచేస్తుంటారు. కానీ విద్యార్ధులు విషాహారం తిని చనిపోతున్నారంటే ఖచ్చితంగా వ్యవస్థ వైఫల్యమే.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేకపోతుండటం, పర్యవేక్షణ కొరవడుతుండటం విస్మయం కలిగిస్తుంది.
అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిందని బిఆర్ఎస్ పార్టీ వేలెత్తి చూపి విమర్శించగలుగుతోంది. ఓ పక్క పిల్లలు చనిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించుకోవడం ఖచ్చితంగా విమర్శలకు తావిస్తుంది.
కాంగ్రెస్ పాలన అంటే ఇలాగే ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ ఆక్షేపిస్తోంది. విషాహారం తిని పిల్లలు చనిపోతుండటం చూస్తుంటే బిఆర్ఎస్ పార్టీ విమర్శలు నిజమే అనిపిస్తాయి.