తెలంగాణ ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీది కీలకపాత్ర కాగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీ కీచులాటల వైఖరే శాపంగా మారుతోంది. తెలంగాణ ప్రయోజనాల కోసం అంటూ నిత్యం అందరితో కొట్లాడుతూనే ఉంటుంది. ఆ కొట్లాటలకు ‘తెలంగాణ సెంటిమెంట్’ విజయవంతంగా జోడించగలిగింది. ఆ సెంటిమెంటుతోనే రాష్ట్రంలో ప్రత్యర్ధి పార్టీలపై రాజకీయంగా పైచేయి సాధిస్తోంది.
తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకే అంటూ అది చేస్తున్న కొట్లాటలతో అది లబ్ది పొందుతుండగా, తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది.
అంతేకాదు… బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్న ఈ కొట్లాటలతో ఇరుగు పొరుగు రాష్ట్రాలను శత్రువులుగా చూపుతోంది. నిజానికి ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో భాగమే. తెలంగాణని కబళించేందుకు చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారని ప్రజలకు నమ్మకం కలిగిస్తూ, ఆ శత్రువుల భారి నుంఛి వారినీ, రాష్ట్రాన్ని తాము మాత్రమే కాపాడగలమని వాదిస్తుండటం గొప్ప రాజకీయ వ్యూహమే కదా?
మాజీ మంత్రి హరీష్ రావు నేడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “అటు మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి, ప్రాణహిత నదుల మీద కొత్తగా ప్రాజెక్టులు కట్టి 74 టిఎంసీలు మళ్ళించుకుంటానని చెపుతోంది. ఇటు కర్ణాటక ప్రభుత్వం కృష్ణానది నుంచి 112 టిఎంసీలు మళ్ళించుకుంటానని చెపుతోంది.
దిగువన ఆంధ్రప్రదేశ్ కృష్ణా, గోదావరి నీళ్ళను తరలించుకుపోతూనే ఉంది. ఈవిదంగా చుట్టూ ఉన్న రాష్ట్రాలు నీళ్ళు ఎత్తుకుపోతుంటే మద్యలో ఉన్న తెలంగాణ పరిస్థితి ఏమిటి? సిఎం రేవంత్ రెడ్డి నిర్లిప్తత కారణంగా మూడు రాష్ట్రాలు నీటిని తరలించుకుపోతున్నాయి,” అని అన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రాజెక్టులు, కాలువలు నిర్మించుకొని నీటిని మళ్ళించుకుంటే తప్పు, అన్యాయం అంటున్నారు హరీష్ రావు. కానీ ఆయనే దగ్గరుండి కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా తెలంగాణలో పలు సాగునీటి ప్రాజెక్టులను కట్టించారు.
అప్పుడు దిగువన ఉన్న ఏపీకి తాము అన్యాయం చేస్తున్నామని హరీష్ రావు అనుకోలేదు. పైగా సముద్రంలో కలుస్తున్న మిగులు జలాలను రాయలసీమ జిల్లాలకు వాడుకుంటే అభ్యంతరం చెపుతుంటారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల వలన తెలంగాణకు నష్టం జరిగిపోతుందని వాదిస్తున్నప్పుడు, ఈ మూడు రాష్ట్రాలకు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి ఎంత నష్టం జరుగుతుంది. ఏపీ పరిస్థితి ఏమిటి?అని హరీష్ రావుకి ఆలోచన కలుగలేదా?అంటే తప్పకుండా తెలుసు. కానీ ఏపీ ఎలాపోయినా మాకు అనవసరం… అన్నట్లు వ్యవహరిస్తుంటారు.
తెలంగాణ చుట్టూ శత్రువులున్నారని కనుక తెలంగాణ ప్రయోజనాల కోసమే వారితో కొట్లాడుతున్నామని, తమకు మాత్రమే తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉందని వాదనల వెనుక అధికారంలోకి రావాలనే దురాలోచన నిగూడంగా ఉంది.
తమ కీచులాటల వలననే తెలంగాణకు నష్టం జరుగుతుంటే, తమ వాక్చాతుర్యంతో అందుకు మోడీని, కేంద్రాన్ని, ఇరుగు పొరుగు రాష్ట్రాలను, సిఎం రేవంత్ రెడ్డిని అందరినీ నిందిస్తూ, ఆ నష్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయ లబ్ది పొందుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఓ పక్క ఈవిదంగా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తు, మళ్ళీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని చెప్పుకోవడం, అది నిజమని ప్రజలను నమ్మించడం వారి వాక్చాతుర్యానికి మరో చక్కటి నిదర్శనమే. కానీ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ వైఖరే తెలంగాణ రాష్ట్రానికి శాపం అని చెప్పక తప్పదు.







